షర్మిలతో వైసీపీకి సంబంధం లేదు

అమరావతి : వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ సోదరి వైఎస్‌ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై వైఎస్సార్సీపీ స్పందించింది. షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు అవకాశాలు, తెలంగాణలో వైసీపీ క్రియాశీలకంగా లేకపోవడంపై ఆ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల పార్టీతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తెలంగాణపై సీఎం జగన్‌తో పాటు వైసీపీ కూడా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నాయని సజ్జల తెలిపారు. అందుకే అక్కడ పార్టీని ముందుకు తీసుకెళ్లడం లేదన్నారు. షర్మిలపై సజ్జల చేసిన వ్యాఖ్యలు పూర్తి క్లారిటీగా ఉండటంతో పాటు సంచలనాత్మకంగా ఉన్నాయి.

“తెలంగాణలో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్‌ షర్మిల కొత్త పార్టీని ఇంకా ప్రకటించలేదంటూనే ఆమె పార్టీ ప్రకటన, దానిపై వైసీపీ వైఖరి వంటి అంశాలపై సజ్జల వివరణ ఇచ్చారు. తెలంగాణ విషయంలో వైసీపీ వైఖరి ఇప్పటికీ స్పష్టంగానే ఉందని తెలిపారు. షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు తమకు ఇష్టం లేదనే అభిప్రాయం ఆయన మాటల్లో వ్యక్తమైంది.

తెలంగాణలో కొత్త పార్టీ కోసం వైఎస్‌ షర్మిల చేస్తున్న ప్రయత్నాలకు తాము అభ్యంతరం తెలిపామని, అయినా తాను వినలేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఏర్పాటు కోసం తాను చేసిన ప్రయత్నాలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా సజ్జల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వైసీపీని ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఏపీ ప్రయోజనాలకు భంగం కలుగుతుందనే జగన్‌ భావిస్తున్నట్లు సజ్జల పేర్కొన్నారు. అందుకే షర్మిలను కూడా కొత్త పార్టీ వద్దని కోరినట్లు ఆయన వెల్లడించారు. అయినా వినకుండా ఆమె ముందుకు వెళ్తోందని సజ్జల చెప్పారు. దీంతో జగన్‌ మాట కూడా వినకుండా షర్మిల ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో వైఎస్‌ షర్మిల ఏర్పాటు చేసే పార్టీకి వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని సజ్జల కుండబద్దలు కొట్టారు. ఆమె ఏర్పాటు చేసే పార్టీకి తమ ఆశీస్సులు ఉండబోవన్నారు. జగన్ పార్టీ జగన్‌దే అని, షర్మిల పార్టీ షర్మిలదే అని సజ్జల స్పష్టంచేశారు. తద్వారా షర్మిల పార్టీకి వైసీపీతో ఎలాంటి లింక్‌ లేదని, ఆమె తన పని తాను చేసుకుపోతుందనే అభిప్రాయాన్ని సజ్జల క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణ విషయంలో జగన్‌కు పూర్తి క్లారిటీ ఉందన్నారు. అందుకే ఆమె ప్రయత్నాలను వ్యతిరేకించినట్లు సజ్జల పరోక్షంగా చెప్పేశారు.

తెలంగాణలో వైసీపీ యాక్టివ్‌గా ఉంటే ఏపీ ప్రయోజనాలకు భంగమని భావించిన సీఎం జగన్‌ ఆ రాష్ట్రంలో పార్టీని వద్దనుకున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. అదే బాటలో షర్మిలను కూడా రాజకీయంగా అక్కడ యాక్టివ్‌గా ఉండాలని కోరుకోలేదని తెలుస్తోంది. అయినా జగన్ మాట కూడా వినకుండా పార్టీ పెట్టేందుకు షర్మిల ముందుకెళ్తున్నట్లు సజ్జల తన వ్యాఖ్యల ద్వారా తెలియజేశారు. తద్వారా వైఎస్‌ జగన్‌తో సంబంధం లేకుండానే షర్మిల కొత్త పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే చివరిగా షర్మిలతో తమకు ఉన్నవి బిన్నాభిప్రాయాలే కానీ విభేదాలు కాదని చెప్పుకొచ్చారు” సజ్జల రామకృష్ణారెడ్డి.