ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రోజా

చైన్నై: తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటిగా కొనసాగిన వారిలో వైసీసీ ఎమ్మెల్యే రోజా ఒకరు. కొన్నేళ్ల పాటు ఆమె తన అందం, అభినయంతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ ఆమె క్రేజ్ అలాగే ఉంది. అయితే ఆమె తన రంగు గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నల్లగా ఉన్నావు సినిమాల్లో ఎలా రాణిస్తావని తాను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో అందరూ కామెంట్ చేసేవారని , అయితే మేకప్ మెన్స్ తనకు కాస్త రంగు వేసి చాలా అందంగా చూపించారని’ రోజా చెప్పారు. సౌతిండియా సినీ, టీవీ మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన కార్యక్రమానికి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె భర్త సెల్వమణి కూడా హాజరయ్యారు.

‘ మేకప్ ఆర్టిస్టుల కారణంగానే తాను అందంగా కనిపించానని చెప్పారు. తమిళ సినీ పరిశ్రమ తనకు పుట్టినిల్లు వంటిదని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని రోజా పేర్కొన్నారు. దివంగత జయలలితను తలచుకుంటే ఎంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతుందన్నారు. ఎంజీఆర్, జయలలిత చెప్పిన మంచి విషయాలు విని తాము రాజకీయాల్లోకి వచ్చామని రోజా వెల్లడించారు. సినీ ప్రముఖులతో ఎలా నడుచుకోవాలో జయలలిత చెప్పారని అన్నారు. సినీ పరిశ్రమ కరెంట్ లాంటిది. సరిగా వినియోగిస్తే వెలుగునిస్తుందని, లేకపోతే షాక్ కొడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత సీఎం పళనిస్వామి ప్రభుత్వం అమ్మ జయ చూపిన దారిలోనే పయనిస్తోందని’సినీ నటి , వైసీపీ ఎమ్మెల్యే రోజా వివరించారు.