ముగిసిన అమిత్ షా – రేవంత్ రెడ్డి భేటీ
-కీలకంగా మారిన భేటీ
-మావోయిస్టు అగ్రనేతల ప్రతిపాదనలపై చర్చ
-లొంగుపోయేందుకు సిద్ధంగా ఉన్న మావో అగ్రనేత గణపతి
-తెలంగాణ పోలీసులకు గణపతి రాయబారం
-తెలంగాణలో ఈగల్ టీంను బలోపేతం చేయాలన్న అమిత్ షా
-మూడో క్యాడర్ రివ్యూను చేపట్టాలని సీఎం విజ్ఞప్తి
-ఐపీఎస్ అధికారుల సంఖ్యను 103కు పెంచాలని విజ్ఞప్తి
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి లొంగిపోయినట్లు వార్తలు రావడంతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఢిల్లీలో కేంద్ర హెంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన లొంగిపోయినట్లు సమాచారం బయటికి రావడంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ఆపరేషన్ కగార్ లో భాగంగానే పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఇప్పటికే లొంగిపోయారు. అయితే దేవ్ జీ లొంగిపోయిన సమయంలోనే గణపతి ఆచూకీ తెలుసుకున్నారు పోలీసులు. గణపతి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ పోలీసులకు రాయబారం పంపినట్లు సమాచారం. అయితే మావో అగ్రనేత గణపతి లొంగిపోయినట్లు వార్తలు రావడంతో ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం కేంద్ర హోం శాఖ మంత్రితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన క్యాడర్ రివ్యూ చాలా ఆలస్యంగా 2025లో జరిగిందని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. ఆ సమయంలోనూ కేవలం ఏడుగురు ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించారని తెలిపారు. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు, హైదరాబాద్ నగరంలో భారీగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని వివరించారు.
మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 83 ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నారని, ఆ సంఖ్యను 103కు పెంచి కేటాయించాలని కోరారు. ఈ భేటీ సందర్భంగా మావోయిస్టుల లొంగుబాటుపై అమిత్ షాతో చర్చించారు. ఇటీవల మావోయిస్టు అగ్ర నాయకుల లొంగుబాటు, వారి పునరావాసం అంశాలు చర్చించారు. గత రెండేళ్లలో తెలంగాణ పోలీసింగ్‌లో గణనీయమైన మార్పులు వచ్చాయని సీఎం రేవంత్ తెలిపారు. రాష్ట్రంలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని చెప్పారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చారని, వారికి నిబంధనల ప్రకారం అందజేస్తున్న పరిహారం, పునరావాసం విషయాలను కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వివరించారు.రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి సహకరించాలని కూడా కోరారు.
ఈ సమావేశంలో సీఎంతో పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ సుమతి, అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ పాల్గొన్నారు. 2026 మార్చి నాటికి దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తం చేసేందుకు కేంద్రం నిర్దేశించుకున్న ‘మావోయిస్టు రహిత భారత్’ లక్ష్యంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మావోయిస్టుల లొంగుబాటుపై సీఎం రేవంత్ రెడ్డి, హోంమంత్రి అమిత్ షాకు నివేదికను అందచేశారు. అదే విధంగా ఇటీవలే తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఆపరేషన్ కగార్ కు తెలంగాణ పోలీసులు సహకరించారని అమిత్ షా అన్నట్లుగా సమాచారం. ఆపరేషన్ పూర్తి అయ్యేంత వరకు ఇలానే సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించింనట్లుగా తెలుస్తోంది. అదే విధంగా మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయేలా చూడాలని, తెలంగాణలో ఈగల్ టీంను బలోపేతం చేయాలని అమిత్ షా, సీఎం రేవంత్ కు దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. ఇక ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటును సీఎం రేవంత్ రెడ్డి, అమిత్ షా కు వివరించారు. తెలంగాణకు ఐపీఎస్ కేడర్ సంఖ్యను పెంచాలని కోరినట్లుగా సమాచారం.













