అత్యాచార బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టికెట్

అత్యాచార బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టికెట్ఉన్నావ్ : ఉత్తరప్రదేశ్ లో పూర్వవైభవం చాటుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లిని అభ్యర్థిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 125 మందితో కూడిన తొలి విడత జాబితాను పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ విడుదల చేశారు.

ఇందులో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్ కూడా ఉన్నారు. ప్రియాంక ప్రకటించిన 125 మంది అభ్యర్థుల్లో 50 మంది ( 40 శాతం ) మహిళా అభ్యర్థులు, మరో 40 శాతం యువకులున్నారు. వీరిలో ఆశా కార్యకర్త పూనమ్ పాండే, సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్ కూడా ఉన్నారు.

2017లో జరిగిన ఉన్నావ్ అత్యాచార ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ దోషిగా తేలారు. దీంతో 2020లో కోర్టు ఆయనకు జీవిత ఖైతు విధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ అమానుష ఘటనపై పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇంటి ముందు బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఈ కేసు జాతీయ స్థాయిలో అతిముఖ్యమైందిగా సంతరించుకుంది.

ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ పై అత్యాచార ఆరోపణలు రావడంతో, బాధితురాలి తండ్రిని అక్రమాయుధాల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో చిత్రహింసలు పెట్టడంతో ఆయన మరణించారు.