అధికారుల అలసత్వంలో నాచారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్

అధికారుల అలసత్వంలో నాచారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్

అధికారుల అలసత్వంలో నాచారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్వరంగల్ టైమ్స్,సిద్ధిపేట జిల్లా: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం నాచారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి. సుమారు 5000 ఏళ్ళ చరిత్ర కలిగిన నాచారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సిద్ధిపేట జిల్లా నాచగిరి కొండలపై వెలిసింది. ఐతే నాచగిరి కొండలపై వెలసిన శ్రీ లక్ష్మీ సమేత నరసింహ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు.ఐతే ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతీ శనివారం,ఆదివారం మాత్రం భక్తులచే స్వామి వారు ప్రత్యేక పూజలు అందుకుంటారు.

ఈ ఆలయం పరిధిలో శ్రీ సీతా రామచంద్రస్వామి ఆలయం,శివాలయం ఉన్నాయి. నాచగిరి పై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి తెలంగాణ రాష్ట్రము నుంచే కాకుండా,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర,చుట్టుప్రక్కల రాష్ట్రాల నుంచి నిత్యం వందలాది మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు, కోర్కెలు కోరుకుంటారు. ఇక ప్రతీ యేటా జరిగే కల్యాణ బ్రహ్మోత్సవాళ్లకు,ఉగాది పర్వదినానికి ముందు వచ్చే ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు.

బ్రహ్మోత్సవాలు,కల్యాణోత్సవాళ్ళకే కాకుండా ఆలయ అర్చకులు, వేద పండితులతో నిత్యం పూజలు అందుకునే ఈ ఆలయం మాత్రం వసతుల కొరతకు నిలయంగా మారింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి ఎక్కువ శాతం భక్తులు శుక్రవారం నాచారంకు చేరుకొని శనివారం, ఆదివారాల్లో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి కోర్కెలు కోరుకుంటారు,మొక్కులు చెల్లించుకుంటారు.

ఐతే ఇలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎంతో భక్తితో, సంతోషంతో తరలివస్తే దేవుణ్ణి మొక్కడం ఒక ఎత్తయితే,ఇక్కడ అరకొర వసతులతో ప్రతినిత్యం అల్లాడటం ఒక ఎత్తవుతుంది. భక్తులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంబంధిత అధికారులకు మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదు. ఇక్కడికి వచ్చే భక్తులకోసం 101 సత్రాలు, గెస్ట్ హౌస్ లు ఏర్పాటు చేసినప్పటికి భక్తులకు కావాల్సిన సరైన వసతులను ఆలయ అధికారులు ఏర్పాటు చేయడం లేదు.అధికారుల అలసత్వంలో నాచారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ఎంతో భక్తితో నాచారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి తరలివచ్చిన భక్తులకు అడుగడుగున సమస్యలే ఎదురవుతున్నాయి. మురికికాలువలు,దోమల బెడదతో పాటు,ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రతతో భక్తులు అనారోగ్యానికి గురవుతున్నారు..నిత్యం పందుల స్వయిరా విహారంతో భక్తులకు దేవుడి మీద భక్తి ఏమో గాని ఆలయ అధికారుల పై మాత్రం విరక్తి చెందుతున్నారు. స్నానాల గదులు,మూత్రశాలలు లేక,కంపుకొడుతున్న పరిసర ప్రాంతాలతో ఆలయ వాతావరణం నిండిపోయింది.అధికారుల అలసత్వంలో నాచారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ఇన్ని ఇబ్బందులు ఎదురుకుంటున్న భక్తులు ఎన్నోసార్లు ఆలయ సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టిన ఫలితం లేకపోయింది. ఇక్కడ వసతులు ఎలా ఉంటే ఏంటి దేవుడి మీద భక్తితో వచ్చే భక్తులు ఎలాగైనా వస్తుంటారు అన్న ధోరనితో ఆలయ ఈవో వ్యహరిస్తుంది. ఐతే ఈ ఏడాది మార్చి 9న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుని ఉగాది ముందు ఫాల్గుణ పంచమి నుంచి స్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.అధికారుల అలసత్వంలో నాచారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ఐతే ఏటా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నాచారం శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయానికి ఈ సారి భక్తుల రద్దీ తగ్గినట్లే కనిపిస్తోంది. వసతుల లేమితో పాటు, ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత,అధికారుల పట్టింపులేని తనంతో నాచారం ఆలయం వెలవెలబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆలయాల అభివృద్ధికి కృషిచేస్తే, ఇప్పుడు మాత్రం ఆలయ అధికారులు నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

భక్తితో స్వామివారిని దర్శించుకోవడమేమో కానీ, కంపుకొడుతున్న ఆలయ వాతావరణం చూసి పరారయ్యే పరిస్థితి వచ్చిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో చరిత్ర కలిగిన నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇప్పటికైనా సరైన వసతులు కల్పించి, పరిశుభ్రంగా ఉంచేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు వేడుకుంటున్నారు.

ఎంతో మంది అధికారులు మారుతున్నప్పటికి ఆలయంలో అభివృద్ధి మాట దేవుడెరుగు, వసతుల లేమి, అపరిశుభ్రతతో భక్తులు అసహనానికి గురవుతున్నారు. ఐతే భక్తుల ఇక్కట్లను చోద్యంగా చూస్తున్న ఆలయ అధికారిని మాత్రం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.