విశాఖపట్టణంలో గవర్నర్ 3 రోజుల పర్యటన

3 రోజుల పర్యటన కోసం విశాఖపట్నంకు గవర్నర్ బిశ్వభూషణ్
రాష్ట్రపతితో కలిసి విభిన్న కార్యక్రమాలలో పాల్గొననున్న గవర్నర్

విశాఖపట్టణంలో గవర్నర్ 3 రోజుల పర్యటనవరంగల్ టైమ్స్, విజయవాడ: మూడు రోజుల పర్యటన కోసం ఏపీ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విశాఖపట్నం వెళ్లనున్నారని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. భారత రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ విశాఖ పర్యటన నేపథ్యంలో ఆదివారం నుండి 3 రోజుల పాటు గవర్నర్ అక్కడ విభిన్న కార్యక్రమాలలో పాల్గొననున్నారన్నారు.

గన్నవరం విమానాశ్రయం నుండి ఫిబ్రవరి 20న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుని, నేరుగా నోవాటెల్ హోటల్ కు చేరుకుంటారు గవర్నర్. సాయంత్రం 5గంటల సమయంలో అక్కడి నుండి నావల్ ఎయిర్ బేస్ – ఐఎన్ ఎస్ డేగా కు చేరుకుంటారు. రాష్ట్రపతిని స్వాగతించి అక్కడి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. రెండవ రోజు సోమవారం ఉదయం నోవాటెల్ నుండి నావల్ డాక్ యార్డ్ లోని ఎన్14ఎ జెట్టీ చేరుకుని ఫ్లీట్‌ రివ్యూ, అనంతరం పీఎఫ్‌ఆర్‌ గ్రూప్‌ ఫొటోలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 1.30 నుంచి 2.45గంటల వరకు రాష్ట్రపతి గౌరవార్ధం నిర్వహించే విందుకు హాజరవుతారు. మూడు గంటల ప్రాంతంలో తిరిగి నోవాటెల్ చేరుకుంటారు. ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటల ప్రాంతంలో నోవాటెల్ నుండి నావల్ డాక్ యార్డ్ చేరుకుని, భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు వీడ్కోలు పలుకుతారు. అక్కడి నుండే నేరుగా ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడ రాజ్ భవన్ కు చేరుకుంటారని సిసోడియా వివరించారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో రెండు రోజులు ముందుగానే విశాఖ చేరుకోనున్న గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా అక్కడి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తారని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.