రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన ఎంపీలు

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన ఎంపీలున్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు నుంచే నిరసనలు మొదలయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ బహిష్కరించింది. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయం మేరకు ఎంపీలు ప్రసంగాన్ని బహిష్కరించారు. ఆ మేరకు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు. అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం విధానాలకు నిరసనగా కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు నినాదాలు చేయడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. రాష్ట్రప్రయోజనాల కోసం కేంద్రంపై గట్టిగా పోరాడాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేసిన విషయం విదితమే.

చట్టపరంగా, న్యాయపరంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, ఆర్ధిక సంఘం సిఫారసులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, జీఎస్టీ నిధులు సహా 23 అంశాలపై పోరాడాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేకపోతే పార్లమెంట్ లో నిరసనలు కొనసాగించాలని ఇప్పటికే నిర్ణయించారు. శీతాకాల సమావేశాలను కూడా టీఆర్ఎస్ బహిష్కరించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించనున్న పార్లమెంట్ ఉభయ సభలకు టీఆర్ఎస్ కు చెందిన లోక్ సభ, రాజ్యసభ ఎంపీలందరూ దూరంగా ఉన్నట్లు లోక్ సఢలో టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు తెలిపారు.