పద్మశ్రీ రామచంద్రయ్యకు కేసీఆర్ భారీ నజరానా

పద్మశ్రీ రామచంద్రయ్యకు కేసీఆర్ భారీ నజరానాహైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలువాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు సకిని రామచంద్రయ్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. సకిని రామచంద్రయ్యకు తన స్థానిక జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలం, నిర్మాణ ఖర్చుకు ఒక కోటి రూపాయల రివార్డును సీఎం కేసీఆర్ ప్రకటించారు. పద్మశ్రీ అవార్డును అందుకున్న నేపథ్యంలో రామచంద్రయ్య సీఎం కేసీఆర్ ను మంగళవారం ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.

అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతిక కళను బతికిస్తున్నందుకు రామచంద్రయ్యను సీఎం అభినందించారు. తన జీవితకాలపు ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును పొందడం పట్ల సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య యోగ క్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇంటి జాగ, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సీఎం ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, మహమూద్ అలి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, తాతామధు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మెత్కు ఆనంద్, గణేశ్ బిగాల, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పద్మశ్రీ కనక రాజుకు రివార్డు ప్రకటించిన సీఎం..
గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు తన స్థానిక జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలం, నిర్మాణం ఖర్చులకోసం ఒక కోటి రూపాయలను సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును సీఎం ఆదేశించారు.