ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తమకు 103 మంది ఎమ్మెల్యేలతో పూర్తి మెజారిటీ ఉందని అన్నారు. మంగళవారం సీఎం మీడియాతో మాట్లాడారు. పూర్తి మెజారిటీ ఉండగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరమేంటని మీడియా ప్రతినిధులను సీఎం ప్రశ్నించారు. మాకేమైనా పిచ్చికుక్క కరిచిందా, వాడెవడో కుక్కగాడు మొరిగితే ముందస్తు ఎన్నికలకు వెళ్తామా అని కేసీఆర్ నిలదీశాడు.

ఈసారి షెడ్యూల్ ప్రకారం గడువు దాటిన తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 95-105 స్థానాల్లో గెలుపొందుతుందని సంచలన ప్రకటన చేశారు. ఇందులో సందేహం లేదు. ఇది నా మాట. ఆ సారి కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవడానికి నా దగ్గర మంత్రం ఉందన్నారు.

2018లో ముందస్తు ఎన్నికలకు 8 నెలల ముందు వెళ్లాం, ఈసారి 6 నెలల ముందు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎం వెల్లడించారు. 2014నుంచి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టులు, కార్యక్రమాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అందువల్లే సరైన టైంలో 8 నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లామని స్పష్టం చేశారు. ఎవడో మెదడు లేనోడు చెప్పినడని ముందస్తు ఎన్నికలకు వెళ్లం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.