ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత

ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత

ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత

వరంగల్ టైమ్స్, హైదరాబాద్‌ : ప్రముఖ నటుడు, కథానాయకులు చంద్రమోహన్‌ (82) ఇకలేరు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలున్నారు.

– సోమవారం అంత్యక్రియలు..
ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసానికి చంద్రమోహన్‌ పార్థివదేహాన్ని తరలించారు. అమెరికాలో ఉన్న చిన్న కుమార్తె మధుర మీనాక్షి వచ్చాక సోమవారం మధ్యాహ్నం తర్వాత చంద్రమోహన్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన మేనల్లుడు కృష్ణప్రసాద్‌ తెలిపారు.‘‘ నాలుగేళ్ల నుంచి చంద్రమోహన్‌ హృద్రోగ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స తీసుకుంటుండగా కిడ్నీలపై కూడా ప్రభావం పడింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు అపోలో ఆస్పత్రికి తరలించాం. ఉదయం 9.45 గంటలకు చంద్రమోహన్ మృతి చెందారు’’ అని కృష్ణప్రసాద్‌ తెలిపారు.ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూతకృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్‌ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌ రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. పలు తమిళ సినిమాల్లోనూ నటించారు. హీరోగానే కాకుండా కమెడియన్, సహాయనటుడిగానూ ఆయన విభిన్న పాత్రలు పోషించారు. ‘ఆత్మీయులు’, ‘తల్లిదండ్రులు’, ‘సంబరాల రాంబాబు’, ‘జీవన తరంగాలు’, ‘గంగామంగా’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘సిరి సిరి మువ్వ’, ‘సీతా కల్యాణం’, ‘శుభోదయం’, ‘పక్కింటి అమ్మాయి’, ‘రాధా కల్యాణం’, ‘ఇంటి గుట్టు’, ‘సువర్ణ సుందరి’, ‘ఆఖరి పోరాటం’ ‘ఆదిత్య 369’, ‘పెద్దరికం’, ‘గులాబి’, ‘చంద్రలేఖ’, ‘ఇద్దరు మిత్రులు’, ‘7జీ బృందావన్ కాలనీ’, ‘ఢీ’, ‘కింగ్‌’, ‘లౌఖ్యం’ వంటి చిత్రాల్లో ఆయన నటించారు. తన నటనకు గానూ ఫిలింఫేర్‌, నంది అవార్డులు అందుకున్నారు.

‘పదహారేళ్ల వయసు’, ‘సిరి సిరి మువ్వ’ సినిమాల్లో ఆయన నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు దక్కాయి. 1987లో ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. చివరగా 2017లో ‘ఆక్సిజన్‌’ సినిమాలో కన్పించారు. దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కు చంద్రమోహన్‌ సమీప బంధువు.