వరంగల్లో మిస్టరీగా మారిన వలస కూలీల మరణాలు

వరంగల్లో మిస్టరీగా మారిన వలస కూలీల మరణాలు

వరంగల్ రూరల్ జిల్లా: వరంగల్ నగర శివారులోని గన్నీ సంచులు కుట్టే కంపెనీలో పనిచేసే వలస కూలీల అనుమానాస్పద మృతి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం రేపింది. తొమ్మిది మంది వలస కూలీల అనుమానాస్పద మృతి వరంగల్ పోలీసులకు సవాలుగా మారింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీంతో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన జరిగిన తీరును పోలీసులకు వున్న అనుభవంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. అయినా ఎలాంటి ఆధారాలు దొరుకకపోవడంతో పోలీసులు షాక్ తింటున్నారు. సంఘటనా స్థలంలో లభ్యమైన మృతదేహాల పరిస్థితి, వారు నివసించిన గదులలో ఆధారాలను పోల్చి చూసినా కూడా పొంతనకుదరడం లేదు. దీంతో పోలీసులకు ఈ కేసు పెనుసవాలుగా మారింది.

హత్య చేశారా…లేదా ఆత్మహత్య చేసుకున్నారా…అని నిర్ణయించలేని పరిస్థితిలో పోలీసులు తర్జనభర్జన అవుతున్నారు. అటు పోలీసు శాఖనే కాదు, మీడియా ప్రతినిధులకు కూడా ఈ సంఘటనపై ప్రజలకు ఏం సమాచారం ఇవ్వాలో కూడా తెలియలేని పరిస్థితి నెలకొంది. ఈ సం‎ఘటనపై పోలీసులను ప్రశ్నించగా వారి అనుభవాల్లో ఇలాంటి కేసు ఎన్నడూ ఎదురుపడలేదని చెబుతున్నారు. ఈ ఘటన జరిగి 48 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ ఎటువంటి ఆధారాలు దొరకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇక ఈ వలస కార్మికుల అనుమానాస్పద మృతి కేసు వివరాలను తెలుసుకుందాం.వరంగల్లో మిస్టరీగా మారిన వలస కూలీల మరణాలుగొర్రెకుంటలోని ఓ కంపెనీలో ఓ గోదాం సమీపంలో వున్న పాడుబడ్డ బావిలో వలస కార్మికుల అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది.  గురువారం రోజు నాలుగు మృతదేహాలు లభ‌్యం కావడంతో అటు ప్రజలు, ఇటు పోలీసులు, మీడియా నిత్యం ఎక్కడో ఒక జరిగే కేసులాగే మొదట భావించారు. శుక్రవారం తెల్లవారు జామున అదే బావిలో మరో ఐదు మృతదేహాలు తేలడంతో  రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త సంచలనంగా మారింది. శుక్రవారం మరో ఐదు మృతదేహాలు లభ్యమవడంతో ఒక్కసారిగా పోలీసు బాసులు రంగంలోకి దిగారు. మొదట క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. బావి నుంచి వారు నివసించే గదుల వరకు సంఘటనా స్థలంలో అన్ని కోణాల్లో పరిశీలించారు. 23 మంది సిబ్బందితో కూడిన డిజాస్టర్ టీం తో పాటు , ఫైర్ సిబ్బందిని పిలిపించి తాళ‌్లతో బావిలో నుంచి మృతదేహాలను వెలికితీసారు. మృతదేహాలకు పంచనామా చేసిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు.

వరంగల్లో మిస్టరీగా మారిన వలస కూలీల మరణాలువివరాల్లోకి వెళ్లితే  20 యేండ్ల క్రితం  పశ్చిమబెంగాల్ నుంచి బ్రతుకుదెరువు కోసం వరంగల్ నగరానికి వచ్చిన ఎండీ మక్సూద్(50), నిషా(45) దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు వున్నారు. వీరు మొదట వరంగల్ అర్బన్ జిల్లాలోని  కరీమాబాద్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండేవారు. చుట్టుప్రక్కల వున్న పరిశ్రమలలో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఇలా చూస్తుండగానే 20 యేండ్ల గడిచిపోయాయి. దీంతో వారు వలస కూలీలుగా కాకుండా స్థానికులన్న కోణంలోనే చుట్టుప్రక్కల వాళ్లు చూసేవారు. అయితే గత 20 యేండ్లుగా చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని పరిశ్రమల్లో పనిచేసిన వీళ్లు, గత యేడాది డిసెంబరు నుంచి గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పనిచేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రాబల్యంతో అన్ని దేశాల్లో లాక్ డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే  లాక్ డౌన్ నేపథ్యంలో రవాణా సౌకర్యం పూర్తి స్థాయిలో బందు కావడంతో మక్సూద్, నిషా దంపతులకు కంపెనీలో కూలీకి వె‌ళ్లడం కష్టంగా మారింది. దీంతో మార్చి చివరి వారంలో  మక్సూద్ కుటుంబం పనిచేసే గోనె సంచుల తయారీ గోదాంలో గల  ఓ గదిలోకి మకాం మార్చారు. అయితే వీరికంటే ముందే  బీహార్ కు చెందిన ఓ కుటుంబం వుంటుంది. ఆ కుటుంబంలోని  శ్రీరాం, శ్యాంలతో మక్సూద్ , నిషా దంపతుల కుటుంబానికి పరిచయం ఏర్పడింది.

అందరూ కలిసికట్టుగా గోనె సంచులో గోదాంలో పనిచేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అయితే మక్సూద్_నిషా దంపతుల కూతురు బస్రు (20) కు ఐదేండ్ల క్రితం ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. బస్రుకు మూడేండ్ల కుమారుడు వున్నాడు. అయితే బస్రు మాత్రం తన భర్తతో విడాకులు తీసుకుని తల్లిదండ్రులు మక్సూద్_నిషా లతోనే జీవనం సాగిస్తోంది. బీహార్ వలస కార్మికులైన శ్రీరాం, శ్యాంలతో మక్సూద్ కూతురు బస్రు సన్నిహితంగా వుండేది.  ఇక్కడి వరకు వీరి కుటుంబాలు కంపెనీలో గోనె సంచులు కుట్టుకుంటూ సంతోషంగా వున్నారు. ఇటీవలికాలంలోనే త్రిపుర నుంచి వరంగల్ కు వలస వచ్చిన షకీల్  అదే కంపెనీలో పనికి చేరాడు. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. అదేంటంటే  బీహార్ కార్మికులు శ్రీరాం, శ్యాం లతో పాటు, షకీల్ అనే వలస కార్మికుడితో కాస్త చనువుగా వుండేదని, ఈ ముగ్గురితో మక్సూద్, నిషా కుటుంబానికి సాన్నిహిత్యం ఏర్పడిందని సమాచారం.

వరంగల్లో మిస్టరీగా మారిన వలస కూలీల మరణాలు

అయితే ఇదే క్రమంలో బస్రు కుమారుడి పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నట్లు స్థానికుల కథనం ప్రకారం తెలుస్తోంది.  పరిశ్రమ యజమాని సంతోష్‌ రోజూలాగే గురువారం మధ్యాహ్నం గోదాంకు వచ్చే సరికి కార్మికులెవరూ కనిపించలేదు. దీంతో గోదాం చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో వెతికాడు. అయినా  కార్మికుల జాడ కనిపించకపోవడంతో యజమాని సంతోష్, తన వ్యాపార భాగస్వామి అయిన భాస్కర్ తో కలిసి చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల లోతుగా పరిశీలించగా గోదాం పక్కనే వున్న పాడుబడ్డ బావిలో చూడగా నాలుగు మృతదేహాలు నీళ్లలో తేలుతూ కనిపించాయి. దీంతో భయాందోళనకు గురైన పరిశ్రమ యజమానులు  స్థానిక గీసుకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం తెలుసుకున్న గీసుకొండ పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి స్టైల్లో ఆధారాలు సేకరించారు.  అనంతరం వరంగల్ నగర పాలక సంస్థ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృంద సభ్యులు, పోలీసులు కలిసి నాలుగు మృతదేహాలను తాళ్లతో వెలికి తీసి మృతదేహాలను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. గోదాం యాజమాన్యాల ద్వారా వివరాలు తెలుసుకున్న పోలీసులు బ్రతుకుదెరువు కోసం  వచ్చిన ఈ వలస కార్మికులు ఆకలి బాధతో ఆత్మహత్య చేసుకున్నారని మొదట భావించి కేసు నమోదు చేసుకుని వెళ్లిపోయారు. అనంతరం  ఆ ప్రాంతం అంతా ప్రశాంతవాతావరణం నెలకొంది.

వరంగల్లో మిస్టరీగా మారిన వలస కూలీల మరణాలుఇక ఒక్కసారిగా ఆ ప్రాంతం నుంచి పోలీసులకు షాకింగ్ న్యూస్ వినపడింది.  అదేంటంటే శుక్రవారం రోజు అదే పాడుబడ్డ బావిలో మరో మృతదేహం కనిపించడంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఈ విషయాన్ని స్థానిక గీసుకొండ సీఐ శివరామయ్య వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవిందర్ కు అందించారు. ఇక వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, నగర సీపీ , వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ వున్న పరిస్థితిని గమనించిన అధికారులు ఇంకా బావిలో ఏమైనా మృతదేహాలు వుండొచ్చన్న అనుమానంతో మరికొంత పోలీసు సిబ్బందితో పాటు, 23 మందితో కూడిన డిజాస్టర్ టీం, ఫైర్ సిబ్బంది కలిసి బావిలో వున్న నీటిని పూర్తిగా పైపుల ద్వారా తోడేశారు. అనంతరం ఆ బావిలోకి అక్కడ వున్న అధికారులంతా షాక్ కు గురయ్యారు.

ఒక్కటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు మృతదేహాలను చూసి కంగు తిన్నారు.  దీంతో మొత్తం మృతదేహాల సంఖ‌్య తొమ్మిదికి చేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త సంచలనంగా మారింది. ఇక బావిలో తేలిన మరో 5 ఐదు మృతదేహాలను తాళ్లతో కట్టి బయటికి తీశారు. గురువారం సాయంత్రం విగతజీవులుగా మారిన వారిలో మక్సూద్, అతని భార్య నిషా, కూతురు బస్రు, మనువని మృతదేహాలుగా గుర్తించిన పోలీసులు, శుక్రవారం బయటపడిన ఐదు మృతదేహాలను మక్సూద్ ఇద్దరు కుమారులు, బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు శ్రీరాం, శ్యాం లతో పాటు త్రిపురకు చెందిన వలస కార్మికుడు షకీలుగా గుర్తించారు. అయితే ఈ మృతదేహాలకు స్థానిక వీఆర్వో, పోలీసుల ఆధ‌్వర్యంలో శవ పంచనామా చేసిన అనంతరం వరంగల్ ఎంజీఎం కు తరలించారు.

వరంగల్లో మిస్టరీగా మారిన వలస కూలీల మరణాలువరంగల్ ఎంజీఎం మార్చురీలో  మృతుడు త్రిపుర వాసి షకీల్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మిగతా 8 మంది  మృతుల కుటుంబాలకు సంబంధించిన వారి ఆచూకి  ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఇక సంఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ , వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్, అర్బన్, రూరల్ జిల్లాల కలేక్టర్లు, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ రావు, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. వలస కార్మికుల  మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.   బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు.  మంత్రి సత్యవతి రాథోడ్ బాధిత కుటుంబాలకు రూ,లక్ష మరియు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరెందర్ లు కుటుంబానికి రూ.50వేల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు.

ఇక కేసు ఈ విషయానికి వస్తే మక్సూద్ కూతురు బస్రుకు బీహార్, త్రిపుర కార్మికులతో పాటు, స్థానికుడైన యాకూబ్ తో ఏదైనా అక్రమసంబంధం వుండటం వల్లే ఈ ఘటన జరిగివుండవచ్చని పోలీసులు పలు కోణాల్లో అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే  యాకూబ్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ కేసు మాత్రం పోలీసులకు పెను సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు.  మరో ప్రక్క ఈ కేసును తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకుంది. ఈ  కేసుకు సంబంధించి దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీసు టీంలను రంగంలోకి దింపింది. అయితే పోస్టుమార్టం రిపోర్ట్స్ వస్తే తప్ప  ఈ వలస కూలీల అనుమానాస్పద మృతి సామూహిక ఆత్మహత్యనా… లేదా పరువు హత్యనా అనేది తేలుతుందని వరంగల్  పోలీసులు అంటున్నారు. ఎన్నో కేసులు ఛేదించిన పోలీసుల అనుభవానికి  ఈ కేసు  కొరకరాని కొయ్యగా మారింది. ఒకట్రెండు రోజులైతే ఈ కేసుపై పూర్తి క్లారిటీ వస్తుంది.