సమ్మక్క సారలమ్మ జాతర చూద్దాం రండి

సమ్మక్క సారలమ్మ జాతర చూద్దాం రండి

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : కోయ గిరిజన సాంప్రదాయాలతో కుంకుమ భరిణే ఆదిశక్తి స్వరూపాలుగా, బెల్లం బంగారంగా తల్లులకు సమర్పించే అరుదైన జాతర. నాలుగు రోజులపాటు జరిగే ఆత్మాభిమాన జాతర. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా జరుపుకునే ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే తెలంగాణ కుంభమేళా శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న వనదేవతల దర్శనానికై అందరి అడుగులు మేడారం వైపే పడుతున్నాయి. దారులన్నీ మేడారం వైపే చూస్తున్నాయి. ఇక్కడ అమ్మవార్లకు గుడి లేదు. విగ్రహాలు లేవు. అయినా మహిమ గల తల్లులు. మొక్కులు చెల్లించుకునేందుకు కోట్ల మంది భక్తులు ఎడ్ల బండ్లల్లో, వాహనాల్లో తరలివస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో శివసత్తుల పూనకాలతో భక్తుల భక్తి పారవశ్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.