ములుగులో గెలుపు బడే నాగజ్యోతిదే :కేటీఆర్
– ఇంస్టాగ్రామ్,ఫేస్బుక్ రీల్స్ ఎమ్మెల్యే వద్దు
– ములుగులో నాగజ్యోతి గెలుస్తుంది
– రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అవడం ఖాయం
– ఏటూరునాగారంలో కేటీఆర్ రోడ్ షో
– హాజరైన అశేష జనవాహిని
– సీతక్కపై కీలక కామెంట్స్ చేసిన కేటీఆర్వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ లో ఫోటోలు పెడుతూ కాలక్షేపం చేసే ఎమ్మెల్యేను కాదు, ఇక్కడే ఉండి పని చేసే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. కేటీఆర్ రోడ్ షోకు పెద్ద ఎత్తున జనాలు కదిలివచ్చారు.కేటీఆర్ రోడ్ షోలో కేటీఆర్ వెంట ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణరావు ఉన్నారు. అంతులేని అశేష జన వాహిని మధ్య కేటీఆర్ రోడ్డు షో జరిగింది. ఏటూరునాగారం అంతా గులాబీ వనాన్ని తలపించింది. జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ నినాదాలతో ఏటూరునాగారం దద్దరిల్లింది.
ఇక రోడ్ షో లో భాగంగా కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన కేటీఆర్ , కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్కపై కీలక వ్యాఖ్యలు చేశారు. గాడిదలకు మేత మేసి, బర్రెలకు పాలు పిండితే వస్తాయా అని సామెత చెప్పిన కేటీఆర్ కాంగ్రెస్ కు ఓటేస్తే ఎలా అభివృద్ధి జరుగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు కూడా పోడు భూముల పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ములుగులో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లేకపోయినా జిల్లాగా మార్చామని తెలిపారు. ఇక కరెంట్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని మండిపడ్డారు. తెలంగాణలో కరెంట్ కష్టాలకు కారణమే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు.
కాంగ్రెస్ వాళ్లు మార్పు కావాలి అంటున్నారు.ఆరు నెలలకోసారి ముఖ్యమంత్రుల మార్పు, రైతుబంధు లాంటి పథకాలన్ని మార్చే ప్రభుత్వం కావాలా ఆలోచించుకోండన్నారు. కాంగ్రెస్ గెలిస్తే పట్వారి వ్యవస్థ, దళారీ వ్యవస్థ వస్తది. సిగ్గులేని కాంగ్రెస్ నాయకులకు 24 గంటల కరెంటు కనబడుత లేదట, ములుగులో రెండు బస్సులు పెడదాం కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, సీతక్కను ఎక్కి తిరగమనండి, 9 మండలాలల్లో కరెంట్ తీగలను ముట్టుకోమనండి అప్పుడు తెలుస్తుంది 24 గంటల కరెంట్ వస్తుందో లేదో అని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు.
ఇక రైతుబంధు గురించి ఈసీ తీసుకున్న నిర్ణయంపై కూడా కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డికి ఈసీకి లెటర్ రాయడం వల్లనే రైతుబంధును ఈసీ మరోసారి ఆపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల నోటికాడి బువ్వను దూరం చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అంటూ ఆరోపించారు. ఇలాంటి కాంగ్రెస్ ను తీసుకొచ్చి మళ్లీ నెత్తిన పెట్టుకుందామా అని ప్రజలను ప్రశ్నించారు. దరిద్రాన్ని మళ్లీ నెత్తిని పెట్టుకుందామి అని కేటీఆర్ ప్రశ్నించారు.ములుగులో మీరు మా అభ్యర్థి ని గెలిపియ్యకపోయినా ములుగుకు జిల్లా, మెడికల్ కాలేజీ, ఏటూరునగరం రెవెన్యూ డివిజన్ ఇవ్వడం జరిగింది. మార్పు కావాలి అంటున్న కాంగ్రెస్ నాయకులు దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆకలికేకలు పేదరికం వుండే, కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే తెలంగాణలో మార్పు జరిగిందన్నారు.
ఇప్పటివరకు 11సార్లు 73000వేల కోట్లు రైతుల అకౌంట్లో వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచిన దేశానికే పిరమైన ప్రధానమంత్రి మోడీ అని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోడీ జన్ దన్ ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తా అన్నాడు. ఏడపోయినయి ఆ పైసలు అని ప్రశ్నించారు. 400రూపాయలకే గ్యాస్ సిలిండర్,సౌభాగ్యలక్ష్మి కింద ప్రతి మహిళకు రూ.3000లు, అన్నపూర్ణ పథకం ప్రతి ఒక్కరికి సన్నబియ్యం రాబోయే మన ప్రభుత్వంలో అందించడం జరుగుతందన్నారు. ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రాం రీల్స్ లో ఫేమస్ అయి టైం పాస్ చేసే ఎమ్మెల్యేను కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని గెలిపించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి మాట్లాడారు. మన కళ్ళ ముందు అభివృద్ధి కనబడుతుంది. మీ అందరి బిడ్డగా ప్రభాకర్ అన్న బిడ్డగా కొంగు చాపి ఓట్లు అడుగుతున్న,నాకు ఒక అవకాశం ఇవ్వండని ములుగు నియోజకవర్గ ఓటర్లను బడే నాగజ్యోతి అభ్యర్థించారు. స్థానిక ఎమ్మెల్యే వందేళ్ల చరిత్ర వున్నా వారి పార్టీని కాదని, మన రామన్నను ఆదర్శంగా తీసుకుంటుంది. అభివృద్ధి అంటే ఏంటో చూపిద్దాం. ఈ ప్రాంతాన్ని కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి చేసుకున్నాము. మరింత అభివృద్ధి జరగాలి అంటే కేసీఆర్ తోనే సాధ్యం అవుతుందన్నారు. మీ ఇంటి ఆడబిడ్డగా అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి. కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి, మన ప్రాంతాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకుపోదాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల అధ్యక్షులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.