కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత సవాల్
వరంగల్ టైమ్స్, బోధన్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరింది. తెలంగాణ కంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్లు రుజువు చేస్తే తాము ఓటు అడగమని, రుజువు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమా అని ఎమ్మెల్సీ కవిత సవాలు విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బోధన్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ కు మద్ధతుగా నిర్వహించిన రోడ్ షోలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు.
ప్రభుత్వ రంగంలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని అన్నారు. అందులో 1.6 లక్షల మంది ఇప్పటికే ఉద్యోగాల్లో చేరారని వివరించారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణను మళ్లీ ఆగం చేయవద్దని ఆమె కోరారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు లేదని, సకాలంలో ఎరువులను సరఫరా చేయలేదని, వడ్లు కొనుగోలు చేయలేదని ఎత్తి చూపించారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధుకు ఎసరు పెడతారని ఆమె స్పష్టం చేశారు.
వచ్చే ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పని వ్యక్తి అని, చెప్పినవి చేసి చూపించారని పేర్కొన్నారు. బోధన్ లో ఎన్ఎస్ఎఫ్ భూముల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. బోధన్ లో షకీల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.