తెలంగాణలో ఫినిషింగ్ టచ్ ఇచ్చిన మోడీ
– భారీ ర్యాలీతో నిండిన భాగ్యనగరం
– హైదరాబాద్ లో ప్రధాని మోడీ మెగా రోడ్ షో
– బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన ప్రధాని
– మహబూబాబాద్, కరీంనగర్‌లో ర్యాలీలు
– అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటెయ్యండి
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. భారీ ర్యాలీతో తన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించారు. హైదరాబాద్‌లో ప్రధాని మోడీ మెగా రోడ్ షో చేపట్టారు. గంటపాటు ఈ రోడ్ షో కొనసాగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు రెండున్నర కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు మోడీ. కాచిగూడ వీరసావర్కర్ విగ్రహం దగ్గర ప్రధాని మోడీ ప్రసంగం అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.
మహబూబాబాద్ సభలో బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు ప్రధాని మోడీ. తెలంగాణ ప్రజలను బీఆర్‌ఎస్ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. అవినీతికి పాల్పడ్డ బీఆర్‌ఎస్ నేతలను తప్పకుండా జైలుకు పంపిస్తామన్నారు ప్రధాని. తెలంగాణకు తప్పకుండా తొలి బీసీ సీఎంని అందిస్తామన్నారు. బీజేపీ పెరుగుతున్న శక్తి అని కేసీఆర్ చాలా కాలం క్రితమే గ్రహించారని అన్నారు. బీజేపీతో ఎలాగైనా దోస్తీ చేయాలని కేసీఆర్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా బీజేపీ ఎప్పటికీ ఏమీ చేయదన్నారు. కేసీఆర్‌ను బీజేపీ తిరస్కరించినప్పటి నుంచి బీఆర్‌ఎస్ భయాందోళనకు గురవుతోందని ఎద్దేవా చేశారు.
అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బరిలోకి దిగిన కరీంనగర్ నియోజకవర్గంలోనూ ప్రధాని మోడీ భారీ బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ తొలి సీఎం బీసీయే అవుతారని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం తెలంగాణ వయస్సు పదేళ్లని, వచ్చే ఐదేళ్లు తెలంగాణ భవిష్యత్తుకు కీలకమని అన్నారు. వచ్చే ఐదేళ్లలో దేశంలోనే నంబర్ వన్ కావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలని కోరారు. తెలంగాణలో మార్పు గాలి వీస్తోందని,మార్పు తథ్యమని అన్నారు.
ప్రజలను మోసం చేసేందుకు ఉన్న ఏ అవకాశాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ వదిలిపెట్టలేదన్నారు ప్రధాని. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తీవ్రవాద సంస్థలకు ఊతం లభిస్తుందన్నారు. బీజేపీ మాత్రమే దేశ ప్రతిష్ఠను పెంచుతుందని మోడీ స్పష్టం చేశారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని ప్రయత్నించామని, కానీ బీఆర్‌ఎస్ సర్కార్ అడ్డుకుందని మోడీ ఆరోపించారు. రైతులకు నీళ్లు ఇస్తానని చెప్పి కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబం అవినీతి అన్నింటిపై విచారణ జరుగుతుందన్నారు ప్రధాని. చలోక్తులు, చమత్కాలతో పాటు తెలుగు భాషలో మాట్లాడి ఓటర్లను తెగ ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, కేసీఆర్ ఒక్కటే. నీళ్లు, నిధులు, నియామకాలు అని నినదించిన కేసీఆర్ పదేళ్లలో చేసిందేంటి? వీటిని స్పష్టమైన తెలుగులో చెప్పారు. బీజేపీ వస్తే మోదీ గ్యారెంటీ ఎలా ఉంటుందో, అసలు మోడీ గ్యారెంటీ ఏంటో కూడా తెలుగులోనే చెప్పుకొచ్చారు. 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో ఈసారి బీజేపీ తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రధాని మోడీ సహా బీజేపీ సీనియర్ నేతలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ప్రధాని మోడీ మహబూబాబాద్, కరీంనగర్‌లో ర్యాలీలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లో ప్రధాని మోడీ రోడ్‌షో చేపట్టారు. అదే సమయంలో, హోంమంత్రి అమిత్ షా కూడా సోమవారం తెలంగాణలో రెండు రోడ్ షోలు, ర్యాలీలో ప్రసంగించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సోమవారం మూడు ర్యాలీలు, రోడ్ షోల్లో పాల్గొన్నారు.