ఎమ్మెల్సీగా మధుసూదనాచారి ప్రమాణస్వీకారం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. మధుసూదనాచారి చేత శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన మధుసూదనాచారికి మంత్రులు, పలువురు టీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
మధుసూదనాచారి రాజకీయ ప్రస్థానం..
1982లో టీడీపీలో చేరిన మధుసూదనాచారి 1994-1999 మధ్యకాలంలో శాయంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంటే ఉన్నారు. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో మధుసూదనాచారి ఒకరు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నూతన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో మధుసూదనాచారి ఓటమి పాలయ్యారు.