బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం

బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదంన్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరికాసేపట్లో లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలిపింది. నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. కరోనా మూడో ఉద్ధృతి, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ సారి బడ్జెట్‌పై యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోనందుకు ఈ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక వేతనజీవులకు కొంతమేర ఉపశమనం లభించొచ్చని తెలుస్తోంది. అంతకుముందు నిర్మలమ్మ బృందం పద్దుల ట్యాబ్‌తో రాష్ట్రపతిని కలిసి బడ్జెట్‌ను వివరించారు.

*బడ్జెట్ ‌2022-23ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌
ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈసారి కూడా కాగిత రహిత బడ్జెట్‌ను ఆమె సమర్పించారు.

*వచ్చే 25ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్‌ పునాది
వచ్చే 25ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్‌ పునాది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభివర్ణించారు. బడ్జెట్‌ 2022-23ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. కొవిడ్‌ కట్టడిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం బాగా ఉపయోగపడిందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో టీకా కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు.

*ఆర్థికంగా కోలుకున్నాం
ఆరోగ్యరంగంలో మౌలిక సౌకర్యాలు, టీకాలు ఆర్థిక రంగ విస్తరణలో కీలక పాత్ర పోషించాయి. ప్రైవేటీకరణలో భాగంగా ఎయిర్‌ ఇండియాను ప్రభుత్వం బదలాయించింది. త్వరలోనే ఎల్‌ఐసీ ఐపీవోను తీసుకొస్తాం. 2021-22లో ఆర్థికంగా కోలుకున్నాం. ఈ బడ్జెట్‌ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది.

*పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది
పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా ఆమె మాట్లాడారు.‘‘వచ్చే 25ఏళ్లు భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు ఉన్నాయి. డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థికసాయం లభిస్తుంది. నీలాంచల్‌ నిస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ప్రైవేటుపరం చేశాం. వచ్చే ఐదేళ్లలో 13లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు’’అని అన్నారు.

*100 వందే భారత్‌ రైళ్లు : నిర్మలా సీతారామన్‌
రైతులకు ప్రయోజనకరంగా రైల్వేలను తీర్చిదిద్దనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ‘‘పీఎం గతిశక్తి పథకంలో సంతులిత అభివృద్ధి. మేకిన్‌ ఇండియా పథకంలో 6 మిలియన్ల ఉద్యోగాలు.100 వందే భారత్‌ రైళ్లు. 100 గతిశక్తి టెర్మినల్స్‌. వచ్చే 25ఏళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ రూపకల్పన. జాతీయ రహదారులు మరో 25వేల కి.మీ. విస్తరణ’చేయనున్నట్లు తెలిపారు.

*చిరుధాన్యాల సంవత్సరంగా 2023
2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ‘‘దేశీయంగా నూనె గింజల పంటల పెంపు, రసాయన రహిత వ్యవసాయానికి ప్రోత్సాహం, నదుల అనుసంధానానికి శ్రీకారానికి పెద్ద పీట వేస్తాం’’అని చెప్పారు. కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా,పెన్నా-కావేరి నదులను అనుసంధానిస్తామని తెలిపారు.

*7 రంగాలపై దృష్టి
తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రధానంగా 7 రంగాలపై దృష్టి సారించినట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పీఎం గతిశక్తి, అభివృద్ధి, ఉత్పాదకత, అవకాశాలు, శక్తివనరులు, వాతావరణ మార్పులపై అధ్యయనం, పెట్టుబడులకు చేయూత.

*డిజిటల్‌ యూనివర్సిటీ స్థాపన
కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యా రంగంపై దృష్టి సారించినట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా డిజిటల్‌ యూనివర్సిటీని స్థాపించనున్నట్లు ప్రకటించారు. ‘‘పీఎం విద్యలో భాగంగా 200 టీవీ ఛానళ్ల ఏర్పాటు. ఈ-కంటెంట్‌లో నాణ్యత పెంపు. డిజిటల్‌ యూనివర్సిటీ స్థాపనకు సిద్ధమైనట్లు తెలిపారు.

*నారీశక్తికి ప్రాధాన్యం
మహిళా, శిశు సంక్షేమశాఖను పునర్‌ వ్యవస్థీకరించనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. మిషన్‌ శక్తి, మిషన్‌ వాత్సల్య, మిషన్‌ అంగద్‌ పథకాలు. ఇంటింటికీ మంచినీటి సరఫరా పథకం విస్తరణ. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్‌ గ్యారెంట్‌ పథకం. ఇందుకోసం రూ.2లక్షల కోట్ల ఆర్థిక నిధులు’’ప్రకటించనున్నారు.

*నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్‌
మొదటి సూత్రం-ప్రధాని గతిశక్తియోజన
రెండో సూత్రం- సమీకృత అభివృద్ధి
మూడో సూత్రం- అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు
నాలుగో సూత్రం- పరిశ్రమలకు ఆర్థిక ఊతం..

*వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపుకోసం స్టార్టప్‌లు
‘‘ఎంఎస్‌ఎంఈలకు మార్కెటింగ్‌ సహకారం కోసం నూతన పోర్టల్‌. ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల అమ్మకానికి ప్రత్యేక ప్లాట్‌ఫాం. వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం స్టార్టప్‌లకు ఆర్థికసాయం. రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు ప్రత్యేక పథకం. ఈశాన్య రాష్ట్రాల్లో యువత, మహిళల అభివృద్ధికి నిధులు. 2లక్షల అంగన్వాడీల ఆధునీకీకరణ, పీఎం ఆవాస్‌ యోజన పథకం ద్వారా 80లక్షల గృహాల నిర్మాణం’’చేయనున్నాట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.