పోలీసుల కస్టడీలో వనమా రాఘవ

పోలీసుల కస్టడీలో వనమా రాఘవఖమ్మం జిల్లా : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కొడుకు వనమా రాఘవేంద్రను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. గత మూడ్రోజులుగా పరీరీలో ఉన్న రాఘవను దట్టమైన అటవీ ప్రాంతమైన దమ్మపేట పరిసరప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక వెహికిల్ లో రాజమండ్రి పారిపోతున్నారన్న సమాచారం తెలుసుకుని చేజ్ చేసి అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ సునీల్ దత్ పేర్కొన్నారు.

పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవను రెండో నిందితుడిగా చేర్చారు. ఈ ఘటన వెలుగు చూసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు.

కొత్తగూడెం-భద్రాద్రి జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందులో వనమా రాఘవేంద్ర ప్రమేయం ఉందని, ఆయన పెట్టిన ఇబ్బందుల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు స్వయంగా రామకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో బయటకు రావడంతో పెను దుమారం చెలరేగింది.

దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. రాఘవేంద్రను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటర తర్వాత రెండు సార్లు మీడియా ముందుకు వచ్చిన రాఘవేంద్ర తర్వాత కనిపించకుండా పోయాడు.