పుతిన్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఐసీసీ
warangaltimes, రష్యా : ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగి లక్షలాదిమంది ప్రాణాలు బలిగొంటున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు చుక్కెదురైంది. ది హేగ్ లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధానికి పుతిన్ బాధ్యుడని తెల్పింది. అంతేకాదు ఆ దేశంలో ఆక్రమించుకున్న ప్రాంతాల నుంచి అక్కడి ప్రజలను, ముఖ్యంగా పిల్లలను రష్యాకు అక్రమంగా తరలిస్తున్న యుద్ధ నేరస్థుడు పుతిన్ అంటూ ఐసీసీ తన అరెస్ట్ వారెంట్ లో వెల్లడించింది. ఉక్రెయిన్ లో జరుగుతున్న నరమేధం, పిల్లల అక్రమ రవాణాకు సంబంధించి పుతినే కారణం అనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయని అంతర్జాతీయ న్యాయస్థానం తెల్పింది.
ఉక్రెయిన్ పిల్లలను అక్రమంగా రష్యాకు తరలిస్తున్నందుకు రష్యా పిల్లల హక్కుల కమిషనర్ మరియా అలెక్సేఎవ్నా వోవా బెలోవాపై కూడా ఐసీసీ న్యాయమూర్తులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మొదటగా పుతిన్, మరియాపై రహస్యంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయాలనుకుంది. అయితే వాళ్లపై బహిరంగంగా అరెస్ట్ వారెంట్ ఇస్తే, మరిన్ని నేరాలను నియంత్రించవచ్చన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయమూర్తులు పేర్కొన్నారు.