కేంద్ర బడ్జెట్ పై 11 గంటల పాటు చర్చ

కేంద్ర బడ్జెట్ పై 11 గంటల పాటు చర్చన్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ పై రాజ్యసభలో 11 గంటల పాటు చర్చ జరుగనున్నది. పలు అంశాలపై చర్చకు సంబంధించి సమయాలను కేటాయించారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అధ్యక్షతన రాజ్యసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. రాజ్యసభా నాయకుడు పీయూష్ గోయల్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంతో పాటు కేంద్ర బడ్జెట్ పై చర్చలకు సమయాన్ని కేటాయించారు.

ప్రస్తుత బడ్జెట్ సమావేశాల తొలి భాగంలో ఉభయ సభల ఎంపీలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో 12 గంటల పాటు చర్చ జరుగనున్నాది. ఫిబ్రవరి 2 బుధవారం ఉదయం 11.30 గంటల నుంచి ఈ చర్చ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 8న ప్రధాని నరేంద్రమోడీ ఈ చర్చకు సమాధానం ఇచ్చే అవకాశమున్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీలు కేంద్ర బడ్జెట్ పై 11 గంటల పాటు చర్చించనున్నారు.

అనంతరం ఫిబ్రవరి 11న 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ చర్చకు సమాధానం ఇస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బీఏసీకి తెలిపారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11న మిగతా సభా కార్యక్రమాలను రద్దు చేయాలని నిర్ణయించారు. దీంతో రాజ్యసభ మొదటి విడత బడ్జెట్ సమావేశాల్లో ఈ రెండు ప్రధాన అంశాలపై చర్చలు జరుపడానికి 23 గంటలకు పైగా సమయాన్ని కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.