ఆయుష్ కన్వీనర్ కోటాకు నేడు,రేపు కౌన్సిలింగ్ 

ఆయుష్ కన్వీనర్ కోటాకు నేడు,రేపు కౌన్సిలింగ్

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : యూజీ ఆయుష్ వైద్య విద్య సీట్ల భర్తీకి కాను మార్చి 1 వరకు అదనపు స్ట్రే వెకెన్సీ విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వర్గం ప్రకటించింది. ఈ మేరకు నేడు యూనివర్సిటీలో మిగిలిపోయిన సీట్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే నాలుగు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయ్యింది. యూనివర్సిటీ పరిధిలోని ఆయుష్ కాలేజీల్లో హోమియోపతి ( బీహెచ్ఎంఎస్), ఆయుర్వేద (బీఏఎంఎస్), యునాని(బీయూఎంఎస్), నేచురోపతి-యోగా(బీఎన్ వైసీ) కోర్సుల్లో మిగిలిపోయిన కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మరో ప్రకటన జారీ చేసింది.

నేటి సాయంత్రం 4 గంటల నుంచి మార్చి 1 మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కాలేజీల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కోరింది. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in ను చూడాల్సిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.