ఆర్ట్స్ కాలేజీలో మార్చి 3 నుంచి ఫ్రీ యోగా శిబిరం
వరంగల్ టైమ్స్,హనుమకొండ జిల్లా : ఈ యాంత్రిక జీవితంలో మానసికంగా, శారీరకంగా బాగుండాలంటే యోగా, ధ్యానం తప్పనిసరి అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మార్చి 3,4,5వ తేదీల్లో సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో హాల్ట్ ఫుల్ నెస్,శ్రీ రామ చంద్ర మిషన్ మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే యోగా, ధ్యానం మహోత్సవ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
నగరంలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్ తో పాటు వరంగల్ , హనుమకొండ జిల్లాల కలెక్టర్లు గోపి, సిక్తా పట్నాయక్, సీపీ ఏవీ రంగనాథ్, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య, హెల్త్ యూనివర్సిటీ వీసీ ప్రొ. డా. కరుణాకర్ రెడ్డి, కేయూ వీసీ ప్రొ. రమేష్ , శ్రీరామచంద్ర మిషన్ ,సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహికులు పాల్గొన్నారు.
ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించే ఈ యోగా మహోత్సవ కార్యక్రమంలో ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున హాజరుకాబోతున్నారని, ఎన్ ఎస్ఎస్, ఎన్ సీసీ వాలంటీర్లు పాల్గొంటారని, నగర ప్రజలు , యువత పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ ఉపయోగించుకోవాలని కలెక్టర్లు సిక్తా పట్నాయక్, గోపీ కోరారు. ఈ మూడు రోజుల్లో జరిగే ఈ ప్రోగ్రాంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీస్ శాఖ నుంచి ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు.
భారతీయ సమాజంలో యోగకు ఒక ప్రాధాన్యత ఉంది. అంతరాత్మకు అందని ఎన్నో మానసిక, శారీరక సమస్యలు యోగ ద్వారా పరిష్కారం సాధ్యమవుతుందని కార్యక్రమం నిర్వహకులు తెలిపారు. ప్రతీ రోజు ధ్యానం, ప్రతీ హృదయానికి ధ్యానం అనే సూక్తితో ఈ ప్రోగ్రాం తలపెట్టినట్లు వారు తెలిపారు. మార్చి 3న సాయంత్రం 5.30 ని.లకు ,4వ తేదీన ఉదయం 6.30ని.లకు, మళ్లీ సాయంత్రం 5.30 ని.లకు, 5వ తేదీన ఉదయం 6.30 ని.లకు, మళ్లీ సాయంత్రం 5.30 గం.లకు ఇలా మూడు రోజుల పాటు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రతీ ఒక్కరు సహకరించి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారు కోరారు.