యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై దాడి
వరంగల్ టైమ్స్, క్రైం డెస్క్ : హన్మకొండ జిల్లా కాంగ్రెస్ యువనేత తోట పవన్ పై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా దాడిచేశారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర నేడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించారు. సోమవారం సాయంకాలం ప్రారంభించిన ఈ పాదయాత్ర రాత్రి వరకు కొనసాగింది. ఈ పాదయాత్రలో భాగంగా హనుమకొండ చౌరస్తా పరిధిలో కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు వేలాది మంది పాల్గొన్నారు.
ఈ సభలో రేవంత్ రెడ్డి కాన్వాయ్ కొద్దిదూరం వెళ్లిన వెంటనే కాంగ్రెస్ యువనాయకుడు తోట పవన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. ఆలస్యంగా గుర్తించిన తోటి కార్యకర్తలు తోట పవన్ ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తోట పవన్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఈ సంఘటన నగరంలో సంచలనంగా మారింది.ఈ విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.