ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ సీట్లకు నోటిఫికేషన్
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా: తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోట ఎంబీబీఎస్ సీట్లకు సెప్టెంబర్ 23,24 తేదీల్లో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ శనివారం మాప్ అప్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రెండో విడత కౌన్సిలింగ్ తర్వాత ఖాళీ అయిన సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సీట్ల ఖాళీల వివరాలను వెబ్ సైట్ లో పొందుపరుచనున్నారు. శనివారం సాయంత్రం 5గంటల నుంచి 24న సాయంత్రం 5 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సిలింగ్ కు అర్హులు. గత విడత కౌన్సిలింగ్ లో సీటు అలాటై జాయిన్ కాకపోయినా, చేరి డిస్ కంటిన్యూ చేసినా, అదే విధంగా ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్ కు అనర్హులని స్పష్టం చేసింది. వివరాల కోసం knruhs.telangana.gov.in వెబ్ సైట్ సంప్రదించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.