ధాన్యం కొనుగోళ్ల నిలదీతపై ఢిల్లీకి చేరిన మంత్రులు

ధాన్యం కొనుగోళ్ల నిలదీతపై ఢిల్లీకి చేరిన మంత్రులుహైదరాబాద్ : ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో మరోసారి చర్చలు జరిపేందుకు తెలంగాణ మంత్రుల బృందం శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నది. మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు ఎంపీలు ఈ బృందంలో ఉన్నారు. కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయల్ తో పాటు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్మెంట్ కోసం రాష్ట్ర అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.

యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనేది లేదని చెప్పిన కేంద్రం రా రైస్ విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. వానాకాలానికి కేంద్రం నిర్దేశించిన కోటా మేరకు ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇంకా సుమారు 20 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనే అంచనాలున్నాయి. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోగా, రాష్ట్రంలో బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడి సమస్యను జటిలం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కేంద్రంతో అనేకసార్లు చర్చలు జరిపారు. ధాన్యం కొనుగోళ్లకు కేంద్రాన్ని ఒప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి కొనసాగింపుగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మరోసారి చర్చలు జరిపేందుకు రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లింది.