జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షహైదరాబాద్‌ : జిల్లాల కలెక్టర్లు, సీనియర్‌ అధికారులతో సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, ధాన్యం సేకరణ, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్తజోనల్‌ విధానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అందుకనుగుణంగానే ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు.

ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగుల విభజన, కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో దీనిపై కేసీఆర్‌ సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయితే అన్ని జిల్లాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ పాలన సజావుగా సాగుతుందన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించే వెసులుబాటు కూడా లభిస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

అందుకనుగుణంగా విభజన ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేసి నాలుగైదు రోజుల్లో నివేదిక అందజేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకునే ప్రక్రియ పూర్తైంది. ఈనెల 20న ఉద్యోగులకు కొత్త జిల్లాల వారీగా విభజన ప్రక్రియ పూర్తి చేసి కేటాయింపులు చేయనున్నారు. ఆ కేటాయింపుల తర్వాత వారం రోజుల్లోగా వారంతా విధుల్లోకి చేరాల్సి ఉంటుంది. వెనుకబడిన మారుమూల జిల్లాల్లో పాలన అందరికీ చేరాలనే ఉద్దేశంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని, ఉద్యోగులు మారుమూల గ్రామాల్లోకి వెళ్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం స్పష్టం చేశారు.

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే వారు ఒకే చోట పనిచేసే విధంగా వెసులుబాటు కల్పించాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా స్పౌస్‌ కేసులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కొత్త జోనల్‌ వ్యవస్థతో ప్రభుత్వ పాలన క్షేత్రస్థాయిలో అమలవుతుందని సీఎం పేర్కొన్నారు.