కొత్త పార్టీ ఎందుకు పెట్టకూడదు..పెడతాం: కేసీఆర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: భారత దేశంలో ప్రజలు కోరితే కొత్త పార్టీ పెట్టడానికి మేం రెడీ అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల కోరిక మేరకు కొత్త పార్టీ పెడితే తప్పేంటని ఆయన అన్నారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ పాలనపై ఆయన ధ్వజమెత్తారు. ప్రజావసరాలకు కావాల్సిన ఏ ఒక్క పథకం కానీ, సంక్షేమం కానీ మోడీ ప్రభుత్వం తీసుకురావడం లేదని ఆయన ఆగ్రహించారు. పైగా ప్రజలపై భారం మోపే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నాడని, రైతులపై ఏమాత్రం కనికరం లేకుండా నల్ల చట్టాలతో ఇబ్బందులకు గురి చేశారని ఆయన దుయ్యబట్టారు.

రాజకీయంలో అహంకారం, స్వార్థం పనికి రాదని ఆయన సూచించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సూటిగా సమాధానాలు చెప్పారు. దేశంలో మారబోయే రాజకీయ పరివర్తన తమ వంతు పాత్ర ఖచ్ఛితంగా ఉంటుందని కేసీఆర్ ఈ సందర్భంగా మరోసారి ప్రకటించారు. బీజేపీ పాలనతో దేశ ప్రజలు సంతోషంగా లేరని ఆయన అన్నారు. దేశంలోని బీజేపీ పాలనలో గవర్నర్ల పాలనా వ్యవస్థ కూడా సరిగ్గా లేదని ఆయన దుయ్యబట్టారు. మత విద్వేశాలే టార్గెట్ గా పెట్టుకుని పాలన కొనసాగించే బీజేపీ కి రానున్న రోజుల్లో ఖచ్ఛితంగా ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. దేశ ప్రజలు కోరుకుంటే ఖచ్ఛితంగా కొత్త పార్టీ పెడతామని, అందులో తన వంతు పాత్ర కీలకంగా ఉంటుందని ఆయన చెప్పారు.