మీకు దమ్ముంటే ప్రజల్లో తేల్చుకోండి : చల్లా
రాజకీయ దుమారంరేపిన స్మారక స్థూపం
సెల్ఫీ వీడియోతో చల్లాపై కొండా ఘాటు వ్యాఖ్యలు
సురేఖ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే చల్లా కౌంటర్
స్థూపం తొలగింపుపై ఎమ్మెల్యే వివరణ
కబ్జాలు చేసుకునే చరిత్ర కొండాది
బెదిరించి భూములు లాక్కున్నారు
దేవుళ్ల ఉసురు తాకే వాళ్లిద్దరు ఫేడ్ ఔట్
మిమ్మల్ని బాధిత రైతులు ఉరికిచ్చి కొడతరు
మీకు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోండన్న చల్లా
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తల్లిదండ్రుల స్మారకస్థూపం తొలంగింపు రాజకీయ దుమారం రేపింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాలతోనే కొండా మురళి తల్లిదండ్రుల స్మారక స్థూపాన్ని కూల్చివేశారని కొండా అనుచరులు ఆరోపిస్తున్నారు. హనుమకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ లో రెండేళ్లకొకసారి మేడారం జాతర నిర్వహిస్తారు.ఈ యేడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు ఈ జాతర జరుగనుంది. ఈ జాతరకు సుమారు 30 లక్షల పై చిలుకు భక్తులు హాజరవుతారు. అయితే గత యేడాదికంటే మెరుగైన వసతులతో ఈ సంవత్సరం జాతర నిర్వహించడం కోసం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దీనిపై జనవరి మొదటి వారంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమీక్ష కూడా నిర్వహించారు. ఇక జాతర సమయం దగ్గరపడుతుండటంతో ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇందులో భాగంగానే నేడు అగ్రంపహాడ్ సమ్మక్క-సారలమ్మ జాతర నూతన పాలకమండలిని నియమించారు. ఈ నూతన పాలక మండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు, నూతన పాలకమండలి సభ్యులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. జాతర ఏర్పాట్లపై సమీక్షించి పలు ఆదేశాలు చేశారు.
అనంతరం వనదేవతలను దర్శించుకుని, జాతర ప్రాంగణాన్ని పర్యవేక్షించారు. ఎమ్మెల్యేతో పాటు ఆత్మకూరు, దామెర మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే జాతర ఏర్పాట్లలో భాగంగానే భక్తుల సౌకర్యార్థం రహదారికి అడ్డంగా ఉన్నదన్న నెపంతో కొండా తల్లిదండ్రుల స్మారకస్థూపాన్ని తొలగించారు. ఈ స్మారక స్థూపం తొలగింపు రాజకీయ దుమారానికి తెరలేపింది.
స్మారక స్థూపం తొలగింపు సమాచారాన్ని తెలుసుకున్న కొండా దంపతులు ఎమ్మెల్యే చల్లా పై మండిపడ్డారు. దీనిపై కొండా సురేఖ ఘాటుగా స్పందించింది. తాను ఎమ్మెల్యే, కొండా మురళి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అగ్రంపహాడ్ జాతర చుట్టుపక్కల రైతుల దగ్గర నుంచి సమ్మక్క, సారలమ్మ వనదేవతల కోసం తమ సొంత డబ్బులతో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, తమ కూతురు సుష్మితా పటేల్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది.
అయితే ఈ భూమిని తాము దేవాదాయశాఖకు అప్పగించలేదన్నారు. జాతర సమయంలో భక్తులకు ఉపయోగపడుతుందన్న ఆలోచనతో పాటు, తమ అత్తామామల గుర్తుగా స్మారక స్థూపాన్ని నిర్మించినట్లు ఆ వీడియోలో తెల్పింది. అయితే స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆ స్థూపాన్ని తొలగించాలన్న దురుద్ధేశంతో ఉన్నాడని కొండా సురేఖ తెల్పింది. గతంలో కూడా స్థూపాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నాడనే విషయాన్ని అప్పుడున్న కలెక్టర్ వాకాటి కరుణ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పింది. దీనిపై స్పందించి భూ రికార్డులు పరిశీలించిన కలెక్టర్ ఆ భూములు ప్రైవేట్ భూములని, అక్కడ స్థూపాన్ని కూలగొట్టే అధికారం ఎవరికీ లేదని అధికారులకు ఆదేశించినట్లు కొండా సురేఖ తెలిపింది.
అయితే ధరణి పోర్టల్ లో ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయో అందరికీ తెలుసని ఎద్దేవా చేసింది. 3 ఎకరాల భూమి ఒరిజినల్ పేపర్లు తమ దగ్గర ఉండగానే ఉద్దేశపూర్వకంగానే మంది మార్బలంతో వచ్చి చల్లా ధర్మారెడ్డి ఈ స్థూపాన్ని కూల్చేసాడని నోరుపారేసుకుంది కొండా సురేఖ. పైగా ఈ భూమి దేవాదాయ భూములుగా చెప్పే ప్రయత్నం చేస్తుండటం సరైంది కాదని కొండా సురేఖ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది.
ఈ వివాదంపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని వరంగల్ టైమ్స్ వివరణ కోరగా ఫోన్ ద్వారా స్పందించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రికార్డుల ప్రకారమే ఆ స్థూపాన్ని తొలగించినట్లుగా తెలిపాడు. పవిత్రమైన దేవాలయ, జాతర ప్రాంగణాల భూములను కబ్జాలు చేసే నీతి కొండా దంపతులదని చల్లా మండిపడ్డారు. అగ్రంపహాడ్ మేడారం జాతర చుట్టు ప్రక్కల భూములను రైతులను బెదిరించి లాక్కున్నది నిజమా కాదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పవిత్రమైన జాతర ప్రాంగణంలో స్మారక విగ్రహాలు పెట్టి అపవిత్రం చేయడం సిగ్గుచేటన్నారు.తల్లిదండ్రుల స్మారక చిహ్నాలను నీ వంచనగిరిలో పెట్టుకో అంతేకాని , రైతుల భూములను కబ్జాకు గురి చేసి, స్మారక చిహ్మాలను రహదారికి అడ్డంగా పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అని అన్నారు. ఇక కోటగండి మైసమ్మ గుడిని సైతం జరిపిన ఘనత కొండా దంపతులదని చల్లా ఎద్దేవా చేశారు. కోటగండి మైసమ్మ గుడిని జరిపి, భూములను ఆక్రమణ చేసుకున్న నీతిమాలిన చరిత్ర కొండా దంపతులదని చల్లా మండిపడ్డారు.
కొండా దంపతులు దేవుళ్ల భూములను ఆక్రమించి, రాజకీయంగా అడ్రస్ లేకుండా పోయారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కౌంటర్ ఇచ్చాడు. తొలగించిన స్థూపం వద్ద నిరసన తెలపడం కాదు..మీకు దమ్మూ, ధైర్యం ఉంటే ఆధారాలతో సహా ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడాలని చల్లా సవాల్ విసిరారు. ఈ సవాల్ తో ఆగని చల్లా మరో ఘాటు వ్యాఖ్య చేశారు. రైతులను బెదిరించి భూములు లాక్కున్న కొండాదంపతులను అదే ప్రాంతం నుంచి బాధిత రైతులు ఉరికించి కొడతారని ఘాటుగా హెచ్చరించాడు.