మేడారంకు జాతీయ హోదా దిశగా కృషి చేస్తాం

మేడారంకు జాతీయ హోదా దిశగా కృషి చేస్తాం

వరంగల్ టైమ్స్,ములుగు జిల్లా: మేడారం శ్రీ సమ్మక్క -సారలమ్మ మహాజాతర రాష్ట్ర పండుగ నుండి జాతీయ పండుగగా గుర్తింపు పొందేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు స్పష్టం చేశారు. గురువారం మేడారం శ్రీ సమ్మక్క…సారలమ్మ సన్నిధిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. దేశంలోనే కుంభమేళా తర్వాత రెండవ అతిపెద్ద పండుగగా మేడారం గుర్తింపు పొందిందని, జాతీయ స్థాయి పొందేందుకు సమైక్యతతో కృషి చేస్తామన్నారు.

ఈ జాతర లక్షలలో వచ్చే భక్తులు కోటికి పైగా చేరుకున్నారని, ప్రతీ సంవత్సరం పెరిగే భక్తులను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు పటిష్టంగా చేపడుతూ విజయవంతం గా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాజాతరలో సారాలమ్మను గత రాత్రి కన్నెపల్లి నుండి గిరిజన సంప్రదాయాలతో వైభవంగా పూజలు జరిపించి గద్దెల వద్దకు భారీ బందోబస్తు మధ్య జిల్లా అధికార యంత్రాంగం పోలీస్, ఆదివాసీల సహకారంతో ఘనంగా తీసుకొచ్చిందన్నారు. గతంలో రాత్రి 12 గంటలయ్యిందని, ఈ జాతరలో 10గంటలకే సారలమ్మ అమ్మవారిని గద్దెలపైకి చేర్చామన్నారు.

మేడారం మహాజాతరకు గతంలో సారలమ్మ వారి సన్నిధికి చేరుకున్న సమయానికి 50 లక్షలమంది భక్తులు చేరుకుంటే ఈ యేడాది జాతరలో 75 లక్షల మంది చేరుకున్నారన్నట్లు మంత్రి తెలియజేశారు. సమ్మక్క గద్దెపై చేరుకునేలోగా మరింతగా భక్తులు దర్శనానికి రానున్నందున భద్రతను మరింతగా పెంచేందుకు అదనపు పోలీస్ బలగాలను రప్పిస్తున్నామన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.

పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తో పాటు చత్తీస్ ఘడ్, మహారాష్ట్రల నుండి భక్తులు వస్తున్నట్లు తెలియజేశారు. అలాగే ఇతర రాష్ట్రాలనుండి ప్రజాప్రతినిధులు రానున్నారని వారికి అతిథి మర్యాదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఫిబ్రవరి 18న శుక్రవారం అమ్మవార్లను దర్శనం చేసుకునేందుకు సీఎం కేసీఆర్ మేడారం చేరుకొని శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుంటారని, సాయంత్రం వరకు జాతరలోనే గడపనున్నందున ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.

మేడారం జాతర ఏర్పాట్లు, భ‌క్తుల రాక‌ను ప‌రిశీలించ‌డానికి హెలికాప్ట‌ర్ ద్వారా ప‌రిశీలించారు. జాతరలో ఏర్పాట్లను మంత్రి 50 కిలోమీటర్ల మేర విహంగ వీక్షణం చేశారు. గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యుఎస్) ద్వారా జాతర కోసం తమ శాఖ ద్వారా రూ. 10 కోట్లు వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు. మేడారం వచ్చే యాత్రికుల ప్రయోజనం కోసం శాశ్వత ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఎస్‌ కృష్ణ ఆదిత్య, ఇతర అధికారులతోనూ మాట్లాడారు. ఈ పర్యటనలో మంత్రి సతీమణి, ఎర్రబెల్లి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ ఉషాదయాకర్‌రావు ఆయన వెంట ఉన్నారు.

మేడారం జాత‌ర‌లో పారిశుద్ద్య ప‌నుల‌ను మంత్రి దయాక‌ర్ రావు త‌నిఖీ చేశారు. పారిశుద్ద్యాన్ని స‌రిగా పాటించ‌ని వారికి ఫైన్ విధించారు. అంద‌రు పారిశుద్యాన్ని జాగ్ర‌త్త‌గా మెయింటెన్ చేయాల‌ని సూచించారు. ప్ర‌భుత్వం మేడారం జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్ధం అన్ని ర‌కాల ఏర్పాట్లు చేసింద‌ని, భ‌క్తులు, వ్యాపారులు కూడా ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని, ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌ను పాటించాల‌ని మంత్రి కోరారు.