వరంగల్ లో అమరులకు నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ లో అమరులకు నివాళులర్పించిన ఎర్రబెల్లి

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనంగా నిర్వహించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ అదాలత్ సెంటర్ లోని అమరవీరుల స్థూపానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండా ని ఆవిష్కరించి జై తెలంగాణ నినాదాలు చేశారు. అమరవీరుల త్యాగాలను నెమరువేసుకున్నారు. అనంతరం మీడియా తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చిట్ చాట్ చేశారు.వరంగల్ లో అమరులకు నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లినాటి ఉద్యమనేత , తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వం, అమరుల బలిదానాలు, త్యాగాల నిరతి ఫలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతును రాజును చేసే పనిలో కేసీఆర్ వున్నారని, అందులో భాగంగానే రైతులకు రుణమాఫీ, రైతు బంధు, రైతుభీమా వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వమే రైతుల పంటలకు రూ.30వేల కోట్లు వెచ్చిస్తున్నారని తెల్పారు.

రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తల అధ్యయనం మేరకు ప్రభుత్వమే ఏయే పంటలు వేయాలో సూచిస్తున్నదని తెలిపారు. దేశం లో తెలంగాణ నెంబర్ వన్ అయితే, తెలంగాణ లో వరంగల్ నెంబర్ వన్ గా మారబోతుందని తెలిపారు. త్వరలోనే పూర్వ వరంగల్ జిల్లాలో అనేక పరిశ్రమలు రానున్నాయని, అన్ని రంగాలలో వరంగల్ అగ్రగామిగా మారనుందని ధీమా వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వానా కాలం సీజన్ లో అంటు వ్యాధులు ప్రబల కుండా జాగ్రత్త పడాలని మంత్రి హెచ్చరించారు.

పల్లె ప్రగతికి కొనసాగింపు గా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణని బంగారు తెలంగాణ చేయడానికి పాటుపడుతున్న సీఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్ లకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ హరిత, సీపీ రవీందర్, ఏసిపి వెంకట లక్ష్మి, పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వివిధ నియోజకవర్గాల్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వివరాలు :

నర్సంపేట: వరంగల్ గ్రామీణ జిల్లావ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నర్సంపేట పట్టణంలోని ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ గుంటి రజిని కిషన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం నర్సంపేట ఆర్డిఓ కార్యాలయంలో 39 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు వివ. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ గుంటి రజిని కిషన్తో పాటు డిఆర్ఓ హరిసింగ్, తహసీల్దార్ రాంమూర్తి, పాల్గొన్నారు.

పరకాల : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినోత్సవం సందర్భంగా వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల, నడికూడ మండలాల ఎంపిపిలు, జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, మార్కెట్ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వర్ధన్నపేట : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు బంగారు తెలంగాణ దిశగా పయనిస్తూ దేశానికే ఆదర్శంగా నిలబడిందని ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. ఈ సంధర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే గారు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పిటీసి, మున్సిపల్ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షుడు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.