గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలి: ములుగు కలెక్టర్

ములుగు జిల్లా: సీజనల్ వ్యాధులను తరిమికొట్టాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, గ్రామాలను పరిశుభ్రంగా వుంచుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య ప్రజలను కోరారు. ములుగు మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. రామచంద్రాపూర్ గ్రామంలో గ్రామంలో నిర్మించిన వైకుంఠదామంను పరిశీలించారు. దహన సంస్కారాలకు ఇబ్బందులు కలగకుండా ప్రవేశం, నిష్క్రమణ దారుల విషయమై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. వైకుంఠదామం పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును పరిశీలించారు. గ్రామ పంచాయితీ ఆవరణలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలి: ములుగు కలెక్టర్అనంతరం గ్రామ పంచాయితీ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. గ్రామంలో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. 590 గృహాలు వున్న రామచంద్రాపూర్ గ్రామంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో ముళ్ల పొదలు, చెత్తా చెదారం తొలగించాలని, ప్రయివేటు భూముల్లో ఉంటే నోటీసులు జారీచేసే, వారు శుభ్రం చేయకుంటే, పంచాయతీ ద్వారా శుభ్రం చేసి, ఖర్చు యజమాని నుండి రాబట్టాలన్నారు కలెక్టర్ అధికారులను కోరారు. గ్రామంలో వంద శాతం పన్నుల వసూలు, విద్యుత్ చార్జీలు బకాయిలతో పాటు చెల్లింపు అభినందనీయమన్నారు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధిపరిచే దిశలో భాగంగా 126 ఇంకుడుగుంతల నిర్మాణ లక్ష్యానికిగాను 30 ఇంకుడు గుంతలను ఇప్పటికే చేపట్టారని, లక్ష్యం మేరకు మిగతావాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామంలో ఏ ఏ పంటలు, ఎంత మేర విస్తీర్ణంలో వేస్తున్నది అడిగి తెలుసుకున్నారు. వానాకాలం పంటలో మొక్కజొన్న వేస్తే దిగుబడి తక్కువ, క్రిమి కీటకాల బెడద ఎక్కువగా ఉంటుందని, కనీస మద్దతు ధర ఉండదు కాబట్టి ఇతర పంటలు వేయాలని రైతులకు సూచించారు. సన్న రకాలు పండించాలని హితవు చేశారు. అవకాశమున్న చోట చెరువులు నింపుటకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏ రైతు ఏ విత్తనం ఎంత మేర కొంటున్నారో ప్రతి క్రయ విక్రయాన్ని పర్యవేక్షణ చేస్తామన్నారు. రైతు నష్ట పోకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 190 లారీల ద్వారా ధాన్యం రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ములుగు జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి జిల్లా రైస్ మిల్లులకు కేటాయించినందున రవాణా, అన్ లోడింగ్ లో కొంత జాప్యం జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. రైతులకు పట్టా లేకున్నా, వీఆర్వో ధ్రువీకరణ పత్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. గ్రామంలో పెద్ద ఎత్తున అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని కోరారు. గ్రామంలో నిల్వ గోదాం, కోల్డ్ స్టోరేజ్, హార్వెస్టర్ తదితర ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఉత్సాహవంతులైన యువకులకు శిక్షణనిచ్చి, స్టార్ట్ అప్ ఇండియా పథకం ద్వారా సబ్సిడీ ఋణ మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసరా పింఛన్లు కొన్ని ప్రభుత్వ స్థాయిలో పెండింగులో ఉన్నాయన్నారు. ప్రతీ ఒక్కరు సమిష్టిగా కృషి చేసి గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవాలని ములుగుజిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎంపిడివో రవి, ఎంపీవో హన్మంతరావు, గ్రామ సర్పంచ్ హెచ్. కల్పన, ఎంపీటీసీ అమృత, ఉప సర్పంచ్ అశోక్, గ్రామ కార్యదర్శి శశి కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి నూతన్ ప్రసాద్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.