తెలంగాణను వణికిస్తున్న చలిపులి
-సంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణను చలిపులి వణికిస్తోంది. కర్ణాటక సరిహద్దుల్లోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ పట్టణంలో అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రంగా వీస్తున్న చలిగాలులతో ప్రజలు వణుకుతున్నారు. ఎర్ర, నల్లరేగడి నేలలు చల్లదనాన్ని వదలకుండా ఉంచే స్వభావంతోపాటు అటవీ ప్రాంతం కావడంతో చలి తీవ్రత పెరిగింది. గత వారం రోజులుగా తెలంగాణలోని కోహిర్ పట్టణాన్ని చలిపులి వణికిస్తోంది. తీవ్ర చలిగాలుల ప్రభావంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చలి తీవ్రత పెరిగినందున నిమోనియా ఉన్న పిల్లలు,ఆస్తమా ఉన్న పెద్దలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని వైద్యులు సూచించారు. రామగుండంలో సోమవారం ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్షియస్ కు చేరింది. నిజామాబాద్ నగరంలో సోమవారం 16.6, హైదరాబాద్ నగరంలో 16.8 ఉష్ణోగ్రత నమోదైంది.