జయశంకర్ భూపాలపల్లి జిల్లా : బీజేపీ అంటేనే వ్యాపార వర్గాల పార్టీ అని, అలాంటి పార్టీకి రైతుల ప్రయోజనాలు ఎలా పడతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. రైతుల ఉసురు పోసుకుంటున్న బీజేపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో బీజేపీ పార్టీ తీరుపై, చింతపండు నవీన్ పై గండ్ర ఫైర్ అయ్యారు.
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు మళ్లీ వస్తాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిజస్వరూపం బయటపడిందని అన్నారు. ఎఫ్ సీఐని ఎత్తి వేసేందుకు కుట్ర జరుగుతున్నదన్నారు.
ఇక మీడియా ముసుగులో బీజేపీ నాయకుడు తీన్మార్ మల్లన్న అసలు స్వరూపం బయటపడిందని ఎమ్మెల్యే గండ్ర మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న తన వైఖరి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఒమిక్రాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.
ప్రభుత్వం సూచిస్తున్న మార్గదర్శకాలను ఖచ్ఛితంగా పాటించాలని కోరారు. జిల్లాలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు, సిబ్బంది నియామకానికి , పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తు చేశారు. నెలరోజుల్లోగా ఈ ఆస్పత్రి ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.