కేసీఆర్ తో గిరిజనులకు గౌరవం పెరిగింది

కేసీఆర్ తో గిరిజనులకు గౌరవం పెరిగింది

వరంగల్ టైమ్స్, నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్ , ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వి.గంగాధర్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, రాథోడ్ బాపురావు , కలెక్టర్ సి.నారాయణ రెడ్డిలు విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. దేవి గడ్ తండాలో రూ. 1.90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. గన్నారం, దేవిగడ్ తండాలోని జగదాంబ దేవి ఆలయం, సేవాలాల్ మహారాజ్ దేవస్థానం రాజగోపురంలను ప్రారంభించారు.కేసీఆర్ తో గిరిజనులకు గౌరవం పెరిగిందిఅనంతరం మంత్రులు, ఎమ్మెల్సీలు , ఎమ్మెల్యేలు జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను తండావాసులకు వివరించారు. ఎంపీగా కల్వకుంట్ల కవిత వున్నప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఎనలేని సేవ చేశారని, ఇప్పుడు ఆమె ఎంపీగా లేకపోవడం వల్ల జిల్లాలో ఎంత నష్టం జరిగిందో ప్రజలు తెలుసుకున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాకే గిరిజనులకు రాష్ట్రంలో గౌరవం పెరిగిందని తెలిపారు. తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని, 3వేలకు పైగా తండాలను పాలించుకునే అవకాశం గిరిజన బిడ్డలకు లభించడం అదృష్టంగా భావించాలని సత్యవతి రాథోడ్ అన్నారు.

రాష్ట్ర రాజధాని నడిబొడ్డున బంజారా హిల్స్ లో కోటి రూపాయిలు ఇచ్చి బంజారా భవన్ నిర్మించి మా ఆత్మ గౌరవం నిలబెడుతున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ అని ఆమె కొనియాడారు.సేవా లాల్ మహరాజ్, జగదాంబ మాత ఆశీర్వాదం సీఎం కేసిఆర్ కు ఉండాలని, ఆయనను మరింత బలోపేతం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఈ సందర్భంగా కోరుకున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ ప్రజల హితం కోసం పనిచేసే పార్టీ అని, గిరిజనులకు ఇబ్బందులు లేకుండా పోడుభూముల సమస్య పరిష్కారం చేస్తామని ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా తండావాసులకు హామీ ఇచ్చారు.

అనంతరం మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్ మంజూరు చేసిన నిధులను, గిరిజనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవాన్ని వారు వివరించారు. ఇక జిల్లాలో పెండింగ్ లో వున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, రాథోడ్ బాపు రావులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ విఠల్ రావు, ‎ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, ఆలయ చైర్మన్ అనితా నాయక్, మేయర్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎంపీపీ లు, సర్పంచ్ లు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.