నిజామాబాద్ జిల్లా : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తొలిసారిగా నిజామాబాద్ లో పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, పలు శుభకార్యాలకు హాజరయ్యారు. ఎమ్మెల్సీగా తొలిసారిగా నిజామాబాద్ విచ్చేసిన కవితకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, బాణసంచాలతో దారిపొడవునా స్వాగతం పలికారు. కార్యకర్తలు బైక్ ర్యాలీలు నిర్వహించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నిజామాబాద్ నగరం, కంఠేశ్వర్ మీదుగా వెళ్తున్న ఎమ్మెల్సీ కవిత, రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను చూసి చలించిపోయారు. వెంటనే వాహనం దిగి మహిళను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం ఇందల్వాయి మండలం దేవితండాలో సేవాలాల్ ఆలయ 8వ వార్షికోత్సవం మరియు రాజగోపురం ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. సేవాలాల్ ఆలయ అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 50 లక్షలు కేటాయించిందని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.లంబాడీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చామని ఆమె తెలిపారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలతో ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నిజామాబాద్ మేయర్ దండు నీతు కిరణ్, జెడ్పీటీసీలు, ఎంపీటీసిలు స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం కేశ్ పల్లి, దర్పల్లిలో జరిగిన కార్యకర్తల వివాహ కార్యక్రమాలకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని హన్నాజీపేట, పీసరగుట్ట తండా వరకు రోడ్డు నిర్మాణానికి మంత్రి సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డితో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.