రాజేంద్రనగర్ లో లారీ బీభత్సం

రాజేంద్రనగర్ లో లారీ బీభత్సం

వరంగల్ టైమ్స్, రంగారెడ్డి జిల్లా : రాజేంద్రనగర్ లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్ లోని హైదర్ గూడ చౌరస్తా వద్ద పాద చారులపై లారీ దూసుకెళ్లింది. బస్సు కోసం ఎదురుచూస్తున్న భార్యా భర్తలను లారీ ఢీకొట్టింది. లారీ చక్రాల కింద భర్త నలిగిపోగా, స్థానికులు లారీ కింద నుండి భార్యను లాగేశారు. వెంటనే 100 కు డయల్ చేసి స్థానికులు ఈ ఘటనపై సమాచారం ఇచ్చారు. దింతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల వివరాల మేరకు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు. కాప్స్ , ఆర్టీసీ బస్సును లారీ ఓవర్ టేక్ చేయడంతో పాటు పాదచారులపైకి దూసుకొచ్చిందని స్థానికులు తెలిపారు.

కర్ణాటక ప్రాంతానికి చెందిన రత్తయ్య, మంజుల దంపతులు బ్రతుకుదెరువు కోసం పొట్టచేత పట్టుకుని హైదరాబాద్ కు వచ్చారు. అయితే రోజువారిలాగే పనులకు వెళ్తున్న వారు ఈ రోజు ఉదయం కూడా బయల్దేరారు. బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యమపాశంలా లారీ ఒక్కసారిగా వారిపైకి దూసుకొచ్చింది. తన కళ్ల ముందే భర్త లారీ కింద నలిగిపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చివరకు ప్రాణాలు విడిచిపెట్టడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. సమయానికి స్థానికులు స్పందించి భార్యను లారీ కింద నుంచి లాగడంతో తీవ్ర గాయాలతో ఆమె బయటపడింది. గుండెపగిలే ఈ దృశ్యాలను చూసిన స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.