వీరయ్య విజయ విహారం..భారీగా ఏర్పాట్లు

వీరయ్య విజయ విహారం..భారీగా ఏర్పాట్లు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ సంబరాలు నేడు హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో గ్రాండ్ గా జరుగనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల తర్వాత తన 154 వ సినిమాను యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 13న సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ పొందుతూ, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.వీరయ్య విజయ విహారం..భారీగా ఏర్పాట్లుఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాదు, చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా విజయోత్సవ వేడుకను భారీగా నిర్వహిస్తున్నారు టీం. అందులో భాగంగానే నేటి సాయంత్రం 6 గంటలకు హనుమకొండలో వాల్తేరు వీరయ్య గ్రాండ్ సక్సెస్ మీట్ ని సినీ ప్రేక్షకాభిమానులు, అతిథులు, చిరంజీవి అభిమానుల సమక్షంలో నిర్వహించేందుకు టీం ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమానికి గెస్టులుగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రానున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు భారీగా చేశారు. ఎత్తైన స్టేజ్ పైన ఎల్ ఈడీ స్క్రీన్లు, భారీ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. కలర్ ఫుల్ లైటింగ్ సిస్టమ్ సభా ప్రాంగణం మొత్తం లైటింగ్ సిస్టమ్, క్యాటగిరీల వారీగా అభిమానులకు, ముఖ్య అతిథులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు సిట్టింగ్ ఏర్పాట్లు చేశారు. దాదాపు రెండ్రోజు క్రితమే హనుమకొండ కు చేరుకున్న టీం ఈ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక గ్రౌండ్ మొత్తం మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ, రామ్ చరణ్ ల కటౌట్ లతో నిండిపోయింది.

వీరయ్య విజయ విహార యాత్ర సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వరంగల్ సీపీ రంగనాథ్ సమక్షంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ కిరణ్ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక ట్రాఫిక్ అంతరాయం కాకుండా ట్రాఫిక్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎంవీవీఐపీ , వీవీఐపీ, వీఐపీల క్యాటగిరీల వారీగా వాహనాలు మళ్లింపుకు ఏర్పాట్లు చేశారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్తానం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు మొట్టమొదటి సారిగా సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా వరంగల్ లో విజయ విహార యాత్ర పెట్టడంతో అభిమానుల సంతోషం అవధులు దాటిందనే చెప్పాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి , చుట్టు ప్రక్కల రాష్ట్రాల నుంచి అభిమానులు ఒక రోజు ముందే తరలివచ్చి ఉన్నారు. మెగాస్టార్ అంటే చచ్చిపోయేంత అభిమానం తమకుందని, అందుకే ఎంత దూరమైనా మెగాస్టార్ ను కలవడానికి వెళ్తామని చెబుతున్నారు. సినీ నటుడిగానే కాకుండా, సేవాభావంతో ఎంతో మంది ప్రాణాలు నిలబెడుతున్న చిరంజీవి కోసం తాము అభిమానులగా పుట్టడం పూర్వ జన్మ పుణ్యఫలం అని అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

అయితే ఈ సభకు లక్ష మందికి పైగా ఎంట్రీ టికెట్లను కేటాయించినప్పటికీ అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే అభిమానులు వచ్చే అవకాశం ఉంది. అయితే కొంతమంది అభిమానులు విహార యాత్ర టికెట్ల కోసం పడిగాపులుకాస్తున్నారు. ఎంతదూరమైనా పర్వాలేదు, ఈ సభా ప్రాంగణంలో తమ చిరంజీవిని చూస్తే చాలు అంటూ తమ ప్రేమను చాటుకుంటున్నారు. అన్నయ్య సభను సక్సెస్ చేయడమే తమ లక్ష్యమని చెబుతున్నారు వీరాభిమానులు