మహారాష్ట్రపై కన్నేసిన కేసీఆర్!! 

మహారాష్ట్రపై కన్నేసిన కేసీఆర్!!

మహారాష్ట్రపై కన్నేసిన కేసీఆర్!! 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి: ఖమ్మం మీటింగ్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ సమరోత్సాహంతో ఉంది. ఖమ్మం సభతో జాతీయస్థాయిలో అందరినీ అట్రాక్ట్ చేయగలిగింది.ఇప్పుడదే ఊపులో ఇతర రాష్ట్రాల్లో పాగాకు కేసీఆర్ జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ నేతలు కొంతమంది ఇప్పటికే గులాబీపార్టీలో చేరారు. తాజాగా ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ తన సన్నిహితులతో బీఆర్ఎస్ గూటికి చేరారు. కేసీఆర్ సమక్షంలో గులాబీకండువా వేసుకున్నారు. ఏపీ, ఒడిశాలో బీఆర్ఎస్ కు మంచి ఆరంభం దొరకడంతో ఇప్పుడు కేసీఆర్ కన్ను మహారాష్ట్రపై పడింది.

*గ్రాండ్ ఎంట్రీ ఆలోచనలో గులాబీ బాస్..
తెలంగాణ పొరుగునే ఉన్న మహారాష్ట్రలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. ఎందుకంటే అక్కడి రాజకీయాల్లో స్తబ్ధత నెలకొంది. శివసేనకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు హ్యాండిచ్చారు. ఏక్ నాథ్ షిండేను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. ఏక్ నాథ్ షిండేకు బీజేపీ తోడవ్వడంతో ఈ ఎపిసోడ్ లో షిండే వర్గం విజయం సాధించినట్లయ్యింది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయారు. ఒకప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన శివసేన, ఇప్పుడు ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడింది.

*అక్కడ కమలానికి వ్యతిరేకతే!
మహారాష్ట్రలో ప్రస్తుతం శివసేన పరిస్థితి బాలేదు, అలాగని రాజకీయ ఉద్దండుడు శరద్ పవార్ సొంతపార్టీ ఎన్సీపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఆ పార్టీకి ఎమ్మెల్యేలున్నా వారంతా బీజేపీ దెబ్బకు సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ నామ్ కే వాస్తే పార్టీగా మిగిలిపోయింది. ఏక్ నాథ్ షిండే వర్గంలో మెజార్టీ ఎమ్మెల్యేలున్నా వారంతా మరోసారి గెలుస్తారా అన్నది చెప్పలేం. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రేకు వెన్నుపోటు పొడిచి, షిండే వెనక వెళ్లిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ షిండేతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్నా, కమలం పార్టీకి పబ్లిక్ లో నెగెటివ్ ఒపినియన్ ఉంది.

ఠాక్రేను గద్దె దింపడానికి బీజేపీ కుట్రలు చేయడం మహారాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారట. అంటే మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ,కాంగ్రెస్, బీజేపీ ఇలా ఏ పార్టీ చూసినా అంతంత మాత్రంగానే ఉంది. పోనీ ఉద్ధవ్ ఠాక్రేను విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న రాజ్ ఠాక్రే ఏమన్నా బలపడ్డారా అంటే అదీ లేదు. ఆయన పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. అందుకే మహారాష్ట్రలో రాజకీయ శూన్యత ఉందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. తాజా పరిణామాలను బీఆర్ఎస్ కు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారు.

*పొరుగు రాష్ట్రం కావడం ప్లస్ పాయింటే!
తెలంగాణ పొరుగునే ఉండడంతో కేసీఆర్ పాలన గురించి మహారాష్ట్ర ప్రజలకు కొంత అవగాహన ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల ప్రజలు,రైతులకు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు గురించి బాగా తెలుసు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమకూ కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఇక కొన్ని గ్రామాలైతే కొంతకాలం కింద తమను తెలంగాణలో విలీనం చేయాలంటూ తీర్మానాలు కూడా చేశాయి. తన పాలన గురించి మహారాష్ట్ర ప్రజలు ఇంత సానుకూలంగా ఉన్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా గుర్తించారు. అందుకే మహారాష్ట్రలో వేగం పెంచాలని ఆయన భావిస్తున్నారు.

*పాగా కంటే ముందు ప్రజలను ఆకట్టుకోవాలి..
మహారాష్ట్రలో పాగా వేయాలంటే ముందు మహారాష్ట్రలోని సరిహద్దు జిల్లాల ప్రజలను ఆకట్టుకోవాలని సీఎం కేసీఆర్ ఆలోచన. అందులో భాగంగానే త్వరలోనే నాందేడ్ లో మీటింగ్ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు నాందేడ్ మీటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం మీటింగ్ తరహాలో అంత భారీ స్థాయిలో కాకపోయినా, మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేలా ఈ సభ నిర్వహించబోతున్నారని టాక్.

ఇలా మహారాష్ట్ర రాజకీయాలను సీఎం కేసీఆర్ చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అక్కడ పాగా వేసేందుకు పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.!!