భూపాలపల్లి బీఆర్ఎస్ లో కాక!!

భూపాలపల్లి బీఆర్ఎస్ లో కాక!!

భూపాలపల్లి బీఆర్ఎస్ లో కాక!!

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి: భూపాలపల్లి బీఆర్ఎస్ లో రచ్చ మొదలైంది.ఎమ్మెల్యే సీటు కోసం గండ్ర వెంకటరమణా రెడ్డి, మధుసూదనాచారి తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇద్దరూ సీటు నాకంటే నాకంటూ తేల్చిచెబుతున్నారు. ఇటీవల కవిత పర్యటనలోనూ రెండు వర్గాలు హడావుడి చేయడంతో ఈసారి టికెట్ కోసం ఇద్దరూ గట్టిగానే పోటీపడతారని చెప్పకనే చెప్పినట్లయ్యింది.

2018ఎన్నికల్లో గండ్ర వెంకటరమణా రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి జంప్ కొట్టారు. ఆయన భార్య గండ్ర జ్యోతికి గులాబీ బాస్ ఏకంగా జడ్పీ ఛైర్మన్ పదవితో గౌరవించారు. భర్తకు ఎమ్మెల్యే, భార్యకు జడ్పీ ఛైర్మన్ పోస్టు ఇవ్వడంతో భూపాలపల్లిలో గండ్ర హవా కొనసాగింది. ఇక మరోసారి కూడా గండ్రకే టికెట్ ఇవ్వడం ఖాయమని ప్రచారం జరిగింది.

*జోరు పెంచిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి
గండ్ర దూకుడు పెంచడం మాట అటు ఉంచితే 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గండ్రపై పోటీ చేసిన మధుసూదనాచారి మాత్రం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. దీంతో చారి వర్గం ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయింది. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఎవరి టైమ్ వస్తుందో చెప్పలేం. అలాగే మాజీ స్పీకర్ మధుసూదనాచారికి కూడా టైమొచ్చింది. సీఎం కేసీఆర్ పిలిచి మరీ ఎమ్మెల్సీ ఇచ్చారు. దీంతో మధుసూదనాచారి మరోసారి యాక్టివ్ అయిపోయారు. నిన్న మొన్నటిదాకా నిస్తేజంగా ఉన్న చారికి గ్రూప్ లో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చేసింది. మధుసూదనాచారి వర్గం మునుపటి ఉత్సాహంతో భూపాలపల్లిలో జోరు పెంచింది.

*టికెట్ పక్కా ఆయనకేనా!
ఎమ్మెల్సీ వచ్చాక మధుసూదనాచారి వర్గం భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకలాపాలను వేగవంతం చేసింది. ఈసారి టికెట్ చారికే అని ఆయన వర్గం బల్లగుద్ది చెబుతోంది. బీఆర్ఎస్ టికెట్ పక్కా మధుసూదనాచారికేనని, గెలిస్తే ఉన్నత పదవి కూడా ఖాయమని చారి వర్గం ప్రచారం చేసుకుంటోందట. మధుసూదనాచారి ఇప్పటికే స్పీకర్ పదవిలో కొనసాగారు. ఈసారి గెలిస్తే మంత్రిపదవి రావడం కూడా పక్కా అని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. దీంతో నిన్నమొన్నటిదాకా చారిని లైట్ తీసుకున్న ప్రజాప్రతినిధులు కొంతమంది ఆయనకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారట. ఎందుకైనా మంచిదని చారి వర్గంతోనూ సన్నిహితంగా ఉంటున్నారని టాక్.

*తగ్గేదేలే అంటున్న గండ్ర
భూపాలపల్లి నియోజకవర్గంలో మధుసూదనాచారి వర్గం జోరు పెంచడంతో ఎమ్మెల్యే గండ్ర కూడా తగ్గేదేలే అంటున్నారు. ఈసారి టికెట్ తనదేనని ఆయన కూడా ధీమాగా ఉన్నారు. ఈసారి గెలిస్తే ఉన్నత పదవి వరించడం కూడా ఖాయమని ఆయన వర్గం కూడా చెప్పుకుంటోందట.అంతేకాదు ఈమేరకు బీఆర్ఎస్ పెద్దల నుంచి గట్టి సంకేతాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

*ఇద్దరూ ఇద్దరే..
గండ్ర, మధుసూదనాచారి ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ రాజకీయ ఉద్దండులే.క్యాడర్ లో ఉత్సాహం నింపే దమ్మున్న నేతలు. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఎటూ తేల్చుకోలేక పోతోందని గులాబీశ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. అయితే సీఎం కేసీఆర్ సిట్టింగులకే టికెట్లిస్తామని ప్రకటించిన నేపథ్యంలో గండ్రకే ఎక్కువ అవకాశం ఉంటుందని టాక్. అంత మాత్రాన సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా ముద్రపడ్డ మధుసూదనాచారికి టికెట్ వచ్చే ఛాన్స్ లేదనైతే చెప్పలేం.

సీఎం కేసీఆర్ కు చారిగారు జిగ్రీ కాబట్టి గండ్రను సముదాయించి,పెద్దాయనకే టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టికెట్ ఇచ్చేది ఎవరికో కానీ ఇప్పట్నుంచే రెండువర్గాలు ఢీ అంటే ఢీ అనడమే చర్చకు దారితీస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ కవిత పర్యటనలో ఈ రెండువర్గాలు గొడవకు దిగడమే అందుకు నిదర్శనం. ఇప్పటికైనా హైకమాండ్ సమస్య తీవ్రతను గుర్తించాలి. రెండువర్గాలకు రాజీ చేయాలి.లేనిపక్షంలో నష్టం పార్టీకేనని గులాబీశ్రేణులు వాపోతున్నారు.