అక్కడ లాక్ డౌన్ షురూ

అక్కడ లాక్ డౌన్ షురూన్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వారాంతపు లాక్ డౌన్ మొదలైంది. ఢిల్లీలో కరోనా విజృంభన కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో 55 గంటల పాటు వారాంతపు లాక్ డౌన్ విధించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు 55 గంటల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.

నిత్యావసర సేవలు మినహా మిగతా అన్ని షాపులు, మార్కెట్లు మూసి ఉంటాయి. ఎమర్జెన్సీగా బయటకు వెళ్లాల్సి వస్తే ఈ పాస్ కోసం ఆన్లైన్ లో అప్లై చేయాలి. ఎయిర్ పోర్ట్స్ , రైల్వే స్టేషన్లు, అంతర్ రాష్ట్ర బస్ టెర్మినస్ ల నుంచి వచ్చే లేదా వెళ్లే వ్యక్తులను వారి టికెట్ల ఆధారంగా ప్రయాణాలకు అనుమతిస్తారు.

మరోవైపు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్స్ వంటి ప్రైవేట్ వైద్య సిబ్బంది, క్లినిక్ లు, ఫార్మసీలు, హాస్పిటల్స్ , డయాగ్నస్టిక్ సెంటర్లు, టెస్టింగ్ లేబోరేటరీలు, ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య ఆక్సీజన్ సరఫరాదారులను వారాంత లాక్ డౌన్ నుంచి మినహాయించారు.

అలాగే న్యాయమూర్తులు, న్యాయఅధికారులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులును గుర్తింపు కార్డులు, సర్వీస్ ఐడీ కార్డులు, ఫోటో ఎంట్రీ పాస్ లు , కోర్టులు జారీ చేసిన అనుమతి లెటర్లపై ప్రయాణించేందుకు అనుమతించనున్నారు.

ఢిల్లీవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 17,335 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం నమోదైన కరోనా కేసుల కంటే శుక్రవారం రోజు 17.73 శాతం పెరిగింది. కొత్తగా 1,390 మంది కరోనా రోగులు హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 39,873కు, మొత్తం కేసుల సంఖ్య 15,06,798 కి చేరింది. గత 24 గంటల్లో కరోనాతో 9 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 25,136కు చేరింది. మరణాల రేటు 1.67 శాతంగా ఉన్నది.