నేడు పట్టాలెక్కిన 9 వందే భారత్ రైళ్లు
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు ఆదివారం పట్టాలెక్కాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా జెండా ఊపి వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ రైళ్లను ఫ్లాగ్ చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. ప్రయాణ సౌలభ్యంపై కేంద్రం దృష్టి సారించిందని, గత ప్రభుత్వాలు రైల్వేకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 25 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయిని తెలిపారు. ఇప్పుడు మరో 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయని మోడీ పేర్కొన్నారు. త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే దిశగా కార్యచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. భారతీయ రైల్వే బడ్జెట్‌ను కూడా కేంద్రం పెంచిందన్నారు. మల్టీ-మోడల్ కనెక్టివిటీపై కూడా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
వేగం,మౌలిక సదుపాయాల అభివృద్ధిపై 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా వందే భారత్ రైళ్లు పనిచేస్తున్నాయని చెప్పారు. కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగానికి ఇది ఒక ఉదాహరణ’అంటూ ప్రధాని మోదీ కార్యక్రమంలో ప్రసంగించారు. తాజాగా ప్రారంభించిన 9 వందే భారత్ రైళ్ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. కాచిగూడ-యశ్వంత్‌పూర్, విజయవాడ-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.