వైఎస్ఆర్సీపి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కవురు, వంకా
వరంగల్ టైమ్స్, ఏలూరు : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులుగా వైఎస్ఆర్సీపి అభ్యర్థులు కవురు శ్రీనివాస్ మరియు వంకా రవీంద్రనాథ్ లు ఎంపికయ్యారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో కవురు శ్రీనివాస్ 481 ఓట్లు సాధించగా, వంకా రవీంద్రనాథ్ 460 ఓట్లు సాధించారు. స్వాతంత్ర్య అభ్యర్థులు వీరవల్లి చంద్రశేఖర్ 122 ఓట్లు, గొరింక దాసు, దేవరపల్లి ఆదాం, పసల వెంకటాచలం లు ఓట్లు సాధించలేదు. మొత్తం 1105 ఓట్లకు గాను, 1088 ఓట్లు పోలయ్యాయి, వాటిలో 1063 ఓట్లు చెల్లుబాటుకాగా, 25 చెల్లని ఓట్లు పోలయ్యాయి.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మరియు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్, ఏలూరు జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వి.ప్రశాంతి, ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి పి.అరుణ్ బాబు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు గట్టి బందోబస్తు మధ్య ప్రారంభయమయ్యింది.ఓట్ల లెక్కింపునకు 5 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం 5 టేబుల్స్ వేయగా, ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ సిబ్బంది ఓట్లను లెక్కించారు.
ఎమ్మెల్సీలుగా గెలుపొందిన కవురు శ్రీనివాస్ మరియు వంకా రవీంద్రనాథ్ లకు రిటర్నింగ్ అధికారి పి.అరుణ్ బాబు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఎమ్మెల్సీలుగా గెలుపొందిన కవురు శ్రీనివాస్ మరియు వంకా రవీంద్రనాథ్ లను ఏలూరు శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్.ఎం.ఆర్.పెదబాబు, ప్రభృతులు పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. జిల్లా రెవిన్యూ అధికారి ఏవిఎన్ఎస్ మూర్తి, ఆర్డీఓలు కె.పెంచెల్ కిశోర్, దాసీ రాజు, డిఆర్డిఏ పీడీ విజయరాజు, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ మధుసూధనరావు, డ్వామా పీడీ రాంబాబు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వై.రామకృష్ణ, తహసీల్దార్ సోమశేఖర్, తదితరులు పాల్గొన్నారు.