బీజేపీ దీక్షలకు, యాత్రలకు అర్థమే లేదు

బీజేపీ దీక్షలకు, యాత్రలకు అర్థమే లేదుహన్మకొండ జిల్లా : ధాన్యం కొనుగోళ్ల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ దీక్షలు, యాత్రల పేరు మీద బీజేపీ చేసే పొలిటికల్ గేమ్ సిగ్గుచేటని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. దొంగ దీక్షలతో తెలంగాణ రైతులకు బీజేపీ నేతలు మభ్యపెట్టలేరని అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల పాలన తెలంగాణలో కొనసాగుతుందని బీజేపీ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన బీజేపీ నేతలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి రీ కౌంటర్ ఇచ్చారు. హన్మకొండ జిల్లా రత్నా హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు తాటి కొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్, తెలంగాణ రాష్ట్ర గొర్ల పెంపకం దారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజయ్య పాల్గొన్నారు.

ఈ సమావేశంలో రైతుల విషయంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వారు ఎండగట్టారు. ఓ వైపు రైతాంగం సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే బీజేపీ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. రైతుల సంక్షేమం కోరేది టీఆర్ఎస్ పార్టీ అయితే, రైతులను మోసం చేస్తూ, వారిపై కపట ప్రేమ చూపించేది బీజేపీ పార్టీ అని తీవ్రంగా విమర్శించారు.

కేంద్రంలో రైతుల నడ్డి విరిచే వ్యతిరేక చట్టాలను ఖండించలేని బీజేపీ శ్రేణులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల బాధలను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం, దొంగ దీక్షలు చేస్తూ రైతులను మభ్య పెట్టలేరని అన్నారు. ఇలాంటి విమర్శలు కొనసాగిస్తూ బీజేపీ , బండి సంజయ్ పొలిటికల్ గేమ్ ఆడితే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. బీజేపీ విమర్శలకు టీఆర్ఎస్ కౌంటర్ రియాక్షన్ ఖచ్ఛితంగా వుంటుందని, దీన్ని ఫేజ్ చేయడానికి మీరు సిద్ధమా అంటూ బండి సంజయ్ కి వారు సవాల్ విసిరారు.