రఘురామరాజు సంచలన నిర్ణయం

రఘురామరాజు సంచలన నిర్ణయంఅమరావతి : ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ రఘురామరాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తాను ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా ఏపీ సీఎం జగన్ వైఖరిని వ్యతిరేకిస్తు పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన నేడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

తమ పార్టీకి చెందిన ఎంపీలు తనపై అనర్హత వేటు వేయించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. అనర్హత ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఎంపీ రఘురామ స్పష్టం చేశారు. వారి ప్రయత్నాలకు ఇంకా సమయం ఇస్తున్నట్లు తెలిపారు. అనర్హత వేటు వేయించకపోతే తానే రాజీనామా చేస్తానని అన్నారు.

అమరావతి రాజధానితో పాటు ప్రజలకు మంచి చేయడం కోసం, రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించడం కోసం తాను నిర్ణయం తీసుకోబోతున్నానని ఎంపీ రఘురామ రాజు తెలిపారు. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తానని వెల్లడించారు. పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ద్వారా తెలియచేస్తానని ఆయన పేర్కొన్నారు.