మరణించిన భర్త వీర్యంతో మాతృత్వం

మరణించిన భర్త వీర్యంతో మాతృత్వం

వరంగల్ టైమ్స్ , వరంగల్ జిల్లా : మాతృత్వం మహాభాగ్యం అంటారు కదా.. పెళ్లైన యేడాదికే ఓ బిడ్డకు జన్మనిస్తే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. కానీ పెళ్లై కొన్నేండ్లు గడుస్తున్నా.. ఆస్పత్రుల చుట్టూ తిరిగి కడుపు తీపిపై మమకారాన్ని చంపులేక ఇబ్బంది పడే మహిళలు ఎంతో మంది ఉన్నారు. అయితే దీనికి తోడు భర్తను పోగొట్టుకున్న ఓ మహిళ ఇప్పుడున్న ఆధునిక వైద్య విధానంతో తన భర్త ప్రతిరూపాన్ని తిరిగి పొందింది. భర్త చనిపోయిన యేడాదిలోపే పండండి బిడ్డకి జన్మనిచ్చింది. అప్పుడు ఆ మహిళ సంతోషం వర్ణణాతీతం.మరణించిన భర్త వీర్యంతో మాతృత్వం

మంచిర్యాలకు చెందిన ఓ జంటకు 2013లో వివాహం జరిగింది. పెళ్లి జరిగి ఏడేళ్లైనా పిల్లలు పుట్టలేదు. వీరు వరంగల్ లోని ఒయాసిస్ సంతాన సాఫల్య కేంద్రంలో 2020 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఆ యేడాది మార్చిలో అక్కడి వైద్యులు పరీక్షల నిమిత్తం భార్యాభర్తల నుంచి అండం, వీర్యం సేకరించి భద్రపరిచారు. కరోనాతో 2021లో ఆమె భర్త మరణించాడు. భర్త చనిపోవడంతో మరో పెళ్లి చేసుకోకుండా ఆ మహిళ అత్తామామలతో ఉంటున్నారు. అయితే ఆస్పత్రిలో భద్రపరిచిన తన భర్త వీర్యం ద్వారా బిడ్డను కని మాతృత్వపు మధురిమలను చవిచూడాలనుకున్నారు.

ఆలోచించిందే తడవుగా అదే విషయాన్ని అత్తా మామలకు ఆమె వివరించారు. వారి అంగీకారంతో డాక్టర్లను సంప్రదించారు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఆమె హైకోర్టుకు వెళ్లారు. కోర్టు సైతం యువతి ఇష్టానికి వదిలేయడంతో దంపతుల నుంచి సేకరించి భద్రపరిచిన వీర్యం, అండాల ద్వారా ఆగస్టు 2021లో ఆస్పత్రి వైద్య నిపుణులు ఐవీఎఫ్ చికిత్స ప్రారంభించారు. అది సక్సెస్ కావడంతో ఈ యేడాది మార్చి 22న పండంటి మగబిడ్డకు మహిళ జన్మనిచ్చారు. 16 రోజుల బాబును చూపిస్తూ తల్లి కావాలన్న ఆ మహిళ పడిన తపన, ఆమెకు అండగా నిలిచిన అత్తమామల గొప్పతనాన్ని ఆస్పత్రి క్లినికల్ హెడ్ డాక్టర్ జలగం కావ్యారావు ప్రశంసించారు.