యూపీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం

యూపీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధంవరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రేపటి తొలి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. కొవిడ్ నిబంధనలతో పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 7 విడతల్లో జరుగబోయే ఈ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కాపాడుకొనేందుకు అధికార బీజేపీ సర్వశక్తుల్ని ఉపయోగిస్తుండగా, కాషాయ దళాన్ని ఓడించడమే లక్ష్యంగా సమాజ్ వాదీ పార్టీ ఆర్ఎల్డీ కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది. ఆ దిశగా అధికార, విపక్షాలు నువ్వా నేనా అన్నట్లుగా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించి విమర్శలు, ప్రతి విమర్శలతో ఉత్తరప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించాయి. దీనికి తోడు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా అఖిలేశ్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించడం విశేషం. తొలి విడతలో భాగంగా పశ్చిమ యూపీలో 11 జిల్లాల పరిధిలోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. ఈ నియోజకవర్గాల పరిధిలో మంగళవారం సాయంత్రమే ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.