ఐనవోలు మల్లన్న జాతరకు పోదాం రండి

ఐనవోలు మల్లన్న జాతరకు పోదాం రండి

హనుమకొండ జిల్లా : తెలంగాణ జీవన విధానానికి, జానపదుల సంస్కృతికి వేదిక ఐనవోలు. అతి పురాతన చరిత్ర గల పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లన్న జాతరను పూర్వకాలమందు జానపదుల జాతరగా పిలిచేవారు. దీనికి కారణం మైలారు దేవుడు మల్లన్నగా కొలువుదీరిన ప్రాంతం ఐనవోలు కావడమే. తెలంగాణ రాష్ట్రంలో ఈ విగ్రహంను పోలిన దేవాలయాలు ఐదు కలవు. నాలుగు దేవాలయాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండగా , ఒకటి మాత్రమే కరీంనగర్ జిల్లాలో కలదు.

కాకతీయ పరిపాలన కాలంలో అయ్యన్న దేవుడనే మంత్రి ఉండేవాడు. ఆయన ఈ దేవాలయం నిర్మించినట్లుగా శాసనముల ద్వారా తెలియుచున్నది. 1100 యేళ్ల చరిత్ర కల్గిన పురాతన శైవక్షేత్రంను అయ్యన్న నిర్మించడం వలన ఈ గ్రామమునకు అయ్యన్నవోలు అనే పేరు వచ్చింది. ఇది కాల క్రమేనా ఐనవోలు, ఐలోనిగా రూపాంతరము చెందినట్లుగా తెలుస్తుంది. ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతున్న హనుమకొండ జిల్లా ఐనవోలు గ్రామంలో కొలువుదీరిన ఈ ఆలయం విశాల ప్రాంగణంతో , శిల్పకళా వైభవంతో , అష్టోత్తర స్తంభములతో, కాకతీయుల కళాతోరణములతో , సింహద్వారములతో చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది. కోటి వరాలిచ్చే భక్తుల కొంగు బంగారం, ఆపదలను తీర్చే మల్లికార్జునుడు.