మేడారంలో ఏర్పాట్లు సంపూర్ణం: కలెక్టర్ కృష్ణ ఆదిత్య

మేడారంలో ఏర్పాట్లు సంపూర్ణం: కలెక్టర్ కృష్ణ ఆదిత్య

వరంగల్ టైమ్స్,ములుగు జిల్లా: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసిందని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. జాతరకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని వరంగల్ టైమ్స్ కు తెలిపారు.

జాతర ప్రాంగణంలో రూ. 75 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అయితే ఆరునెలల క్రితమే ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం వల్ల రహదారి విస్తరణ నుంచి ప్రత్యేక బస్సులను కేటాయించడం వరకు అధికారులు అన్నీ ఏర్పాట్లను సంపూర్ణంగా చేసినట్లు పేర్కొన్నారు.

జాతరకు వచ్చే భక్తుల కోసం శాశ్వత ,తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానఘట్టాలు, స్నానాల గదులను ఏర్పాట్లు చేసినట్లు తెలిపరు. జాతరకు వచ్చే భక్తులు ప్రయాణంలో ఇబ్బందులు పడకుండా 4 వేల ఆర్టీసీ బస్సులను టీఎస్ ఆర్టీసీ నడుపుతుంది. ప్రైవేట్ వాహనాల పార్కింగ్ కోసం 1100 ఎకరాలను సిద్ధం చేశారు. 32 ఎకరాల్లో బస్ స్టేషన్ ను ఏర్పాట్లు చేశారు. జంపన్న వాగు వరకు 25 బస్సులు నిరంతరం నడిచేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.

ఈ జాతరలో వనదేవతలను దర్శించుకునేందుకు సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు వస్తుంటారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్ మేడారం వనదేవతల దర్శనానికి రానున్నారు. అందుకోసం ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి జాతర ఏర్పాట్లను ప్రతీ రోజు పర్యవేక్షిస్తున్నారు. మేడారం జాతరలో భారీ బందోబస్తును కల్పించారు. 11 వేల మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్నారు. జాతర ప్రాంగణం నుంచి అర కిలో మీటరుకు ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది. వాటన్నింటిని ప్రభుత్వం కంట్రోల్ రూంను కలెక్ట్ చేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, భక్తుల కదలికపై అధికారులు ఓ కన్నేసి ఉంచారు.

ఇక తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన ఈ మేడారం జాతరను 1940 నుంచి ఘనంగా జరుపుతున్నారు. 1966లో ఈ జాతరకు రాష్ట్ర అధికారిక పండుగగా గుర్తించింది. అప్పటి ప్రభుత్వం అనేక ఏర్పాట్లు , సౌకర్యాలను కల్పించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత సమ్మక్క, సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి మేడారంకు హెలికాప్టర్ సేవలను కూడా అధికారులు అందుబాటులో ఉంచారు.