హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీకి నిద్ర పట్టడం లేదని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. దేశంలో కురచ బుద్ధి ఉన్న ప్రధాని ఉన్నాడు అని మోదీని కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. దేశంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో మాత్రం బీజేపీ వాళ్లు ధర్నా చేస్తరు. మంది మీద పడి ఏడవడం మానుకోవాలి. పచ్చి అబద్దాలు చెప్పి ఈ దేశాన్ని మోసం చేస్తున్నారు.
చాలా బాధాకరం ఏంటంటే.. కేంద్రానికి, బీజేపీకి సిగ్గుండాలని అన్నారు. చాలా దరిద్రం.. ఈ భారత సమాజం పురోగమించాలంటే బీజేపీని కూకటివేళ్లతో పెకిలించి బంగ్లాదేశ్‌లో కలపాలి. తప్పకుండా వంద శాతం ఈ పని చేస్తాం. పొగరు నెత్తిమీదకు ఎక్కింది. అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. దేశానికి ఏం అవసరమో అది చేస్తాం. ఉద్యమిస్తాం. ఏం చేయాల్నో అది చేస్తాం. దుర్మార్గాలను పీకి అవతల పాడేస్తాం. దేశంలో కురచ బుద్ధి ఉన్న ప్రధాని ఉన్నాడు.
భారతదేశంలో పరిశ్రమలు పెరిగాయి. వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. సాఫ్ట్ వేర్, ఐటీ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థల మధ్య అత్యధిక పెట్టుబడుదారుల మధ్య గొడవలు జరుగుతాయి. కోర్టుల్లో పరిష్కారం కావాలంటే సమయం పడుతోంది. కోర్టు బయట పంచాయతీలు తెంపుకునే వ్యవస్థను యావత్ ప్రపంచం అవలంభిస్తోంది. దీన్ని పుట్టుకు వచ్చిందే లోకాయుక్త. ఆర్బిట్రేషన్ సెంటర్లు కూడా మన దేశంలో లేవు. సింగపూర్, దుబాయ్, లండన్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్లు ఉన్నాయి. ఇండియా పారిశ్రామికవేత్తలు కూడా పంచాయతీలను అక్కడ తెంపుకుంటారు. ఈ అంశం తన దృష్టికి వచ్చిన తర్వాత సీజేఐ ఎన్వీ రమణను ప్రార్థించాను. వారు దయతలచి ఆర్బిట్రేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.
కొంత ఖర్చు అయినా భయపడకుండా ముందుకు వచ్చి ఈ సెంటర్‌కు ఓ భవనాన్ని కిరాయికి తీసుకొని, రూ. 15 కోట్లతో సదుపాయాలు కల్పించాం. ప్రతి సంవత్సరం రూ. 3 కోట్లు ఇస్తామని చెప్పాం. రూ. 300 కోట్ల విలువైన జాగను ఇచ్చాం. రూ. 50 కోట్లతో బిల్డింగ్ కూడా కట్టబోతున్నాం. ఈ నెల 5న శంకుస్థాపన చేస్తారు. అహ్మదాబాద్‌లో పెట్టాలని ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారు. కానీ దాన్ని హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా మోదీకి నిద్ర పట్టడం లేదు. దీనికి పోటీగా గిఫ్ట్ సిటీ అని ఒక సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు. నిర్మలా సీతారామన్ కూడా ఆత్మ ద్రోహం చేసుకున్నారు. హైదరాబాద్ యువకులు, మేధావులు బీజేపీ ప్రభుత్వ విధానాలపై ఆలోచించాలి అని సీఎం కేసీఆర్ సూచించారు.