లోక్ సభ రేపటికి వాయిదా..

న్యూఢిల్లీ : నేడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెషన్ మొదలవగానే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉదయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఆమె స్టాటిస్టికల్ అపెండిక్స్ తో సహా ఆర్థిక సర్వేను సభ ముందుంచారు. అనంతరం లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సభను రేపటికి వాయిదా వేశారు. కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరుగనున్నాయి. మొదటి విడత నేటి నుంచి ఫిబ్రవరి 11 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. రేపు పార్లమెంట్ ఉభయసభల్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.